బాసర ట్రిపుల్ ఐటీలో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు నిన్న మధ్యాహ్న భోజనంలో ఎగ్‌ఫ్రైడ్ రైస్ పెట్టారు. అది తిన్న గంటకే వారంతా వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో క్యాంపస్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. వందమందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
కొందరికి అక్కడే వైద్యం అందించగా, తీవ్ర అస్వస్థతకు గురైన 15 మంది విద్యార్థులను నిజామాబాద్ తరలించినట్టు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.