తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిర్వహించారు. 30వ తేదీ మరియు 31వ తేదీ రెండు రోజుల పాటు AITUC ఆధ్వర్యంలో సభలను నిర్వహించగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీడీ కార్మికులు పాల్గొన్నారు. బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా AITUC రాష్ట్ర కార్యదర్శి, బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఇంచార్జ్ ఎస్. విలాస్ దూరదర్శన్ తో మాట్లాడుతూ బీడీ కార్మికులు ఎన్నో ఏళ్లుగా బీడీలు చుడుతూ జీవనాన్ని కొనసాగిస్తూ చాలి చాలని వేతనంతో కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నారని ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమపై GST పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేసారు. కనీస వేతనాల జి.వో. అమలు చేయాలి మరియు దేశవ్యాప్తంగా ఒకే రకమైన వేతనం ఇవ్వాలని కోరారు. నెలకు 26 రోజుల పని కల్పించాలని, మంచి తునికి ఆకులను సరఫరా చేయాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PM ఆవాస్ యోజన పథకం ద్వారా అర్హులైన పేద బీడీ కార్మికులకు ఇండ్లు కట్టించి ఇవ్వాలన్నారు. EPF సంస్థలో బీడీ కార్మికులు రాజీనామా అనంతరం కనీస పెన్షన్ను రూ॥ 6000/-లకు పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మిక సంక్షేమ ఆసుపత్రికి నిధులు కేటాయించి, వైద్య సౌకర్యాలు మెరుగుపరచి, అన్నిరకాల టెస్టులు మరియు చికిత్స చేయాలని, కార్మికుల ప్రసూతికి ఆర్థిక సహాయం, బీడి స్కాలర్షిప్, సంక్షేమ పథకాలు యదావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ESI ఆసుపత్రిని ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు, ప్రతి బీడి కార్మికులకు రూ. 2016/- నుండి 4016/- పెంచి ఇవ్వాలన్నారు. అలాగే స్వంత స్థలం కలిగియున్న బీడి కార్మికులకు ఇళ్ళ నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయంను హామీ మేరకు అందించాలి. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.