- బెగ్గింగ్ మాఫియా
- నెల మొత్తం మీద రూ.2 లక్షల ఆదాయం
- ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే డ్యూటీ
ట్రాఫిక్ కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ పడిన వెంటనే వాహనాలు నిలిచిపోతాయి. అంతలోనే నలు వైపుల నుంచి యాచకులు ధర్మం, దానం అంటూ చేయి చాపుతూ ప్రతీ వాహనదారుడి వద్దకు వెళ్లి అడగడం భాగ్యనగర వాసులు నిత్యం ఎదుర్కొనే అనుభవమే. మాసిపోయిన వస్త్రాలు ధరించి యాచించే వీరికి అందరూ కాకపోయినా కొందరైనా దానం చేస్తుంటారు. ఇలా అడుక్కునే వారికి నెలలో ఎంత ఆదాయం వస్తుందో తెలుసా..? దీని గురించి ఎవరూ ఆలోచించి ఉండరు.
యాచనను వృత్తిగా చేసుకున్న ఓ కుటుంబం నెల మొత్తం మీద రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు సంపాదిస్తోంది. బెగ్గర్ మాఫియాకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు యాచకులను ప్రశ్నించినప్పుడు విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని ట్రాఫిక్ జంక్షన్ల వద్ద యాచించే వారు ముఠాలో భాగం. ఒక్కో కూడలిని ఒక కుటుంబం అడ్డాగా చేసుకుని యాచిస్తున్నట్టు తెలిసింది.
భార్యా, భర్త, నలుగురు లేదా ఐదుగురు పిల్లలు కలసి ఓ కూడలి వద్ద యాచిస్తున్నారు. అక్కడికి వేరొక వ్యక్తిని యాచించేందుకు వీరు అనుమతించరు. రోజువారీ వీరంతా కలసి ఓ కూడలి వద్ద రూ.4,000 నుంచి రూ.7,000 వరకు సంపాదిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్యారడైజ్, ట్యాంక్ బండ్, జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్, మసాబ్ ట్యాంక్, అబిడ్స్ రోడ్, కోటి ఉమెన్స్ కాలేజ్, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం కూడళ్లకు డిమాండ్ ఎక్కువ. వివాదం ఏర్పడినప్పుడు పెద్దలు రంగంలోకి దిగి పరిష్కరిస్తారట. కుటుంబం అంతా కలసి ఉదయం ట్రాఫిక్ కూడలికి చేరుకుని, రాత్రి వరకు అక్కడే ఉండి తిరిగి ఆటోలో వెళ్లిపోతున్నట్టు పోలీసులు వెల్లడించారు.
వీరందరినీ మాఫియా ముఠా నడిపిస్తోందని వెల్లడైంది. వికలాంగులు, పిల్లలు, పెద్దలను డబ్బు ఆశ చూపించి తీసుకొచ్చి యాచన చేయిస్తున్నట్టు గుర్తించారు. ప్రతి ఒక్క యాచకుడు లేదా యాచకురాలికి రోజు మొత్తం మీద ధర్మం పేరుతో సంపాదించినందుకు రూ.200 వరకు మాఫియా చెల్లిస్తోంది. వారికి ఆహారం, వసతి ఏర్పాటు చేస్తున్నారు. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన 28 ఏళ్ల అజిత్ పవార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు 23 మందితో యాచన చేయిస్తున్నట్టు వెలుగు చూసింది. అతడి నుంచి ఎనిమిది వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బుతో కర్ణాటకలో ఆస్తులు పోగేసుకుంటున్నట్టు తెలిసింది.