- పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఉపన్యాసం
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం మధ్యాహ్నం భారత రాజ్యాంగంపై విస్తృత ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం గోపాల్ అధ్యక్షతన పొలిటికల్ సైన్స్ విభాగం అధ్యాపకురాలు కూనురాజుల సమ్మక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. రిసోర్స్ పర్సన్ గా బెల్లంపల్లి కోర్టు అడ్వకేట్ కె.పి. బాలకృష్ణ హాజరయ్యారు. భారత రాజ్యాంగం గురించి విద్యార్థులకు పలు వివరాలు తెలియజేశారు.
ఆర్టికల్స్ పై అవగాహన అవసరం:
భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 14, 21, 32 తదితర ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి విద్యార్థిని, విద్యార్థులు అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉందని తెలిపారు. భారత రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాల గురించి ఈ సందర్భంగా విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు.
భారత రాజ్యాంగంతో భవిష్యత్తు:
కళాశాల ప్రిన్సిపాల్ ఎం గోపాల్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు భారతావని ఎంత విజయవంతంగా ముందుకు సాగుతుందో గుర్తు చేశారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టి ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, రాజ్యాంగ రూపకల్పన వెనుక ఉన్న శ్రమను, రాజ్యాంగం మనకు అందిస్తున్న విలువలను వివరించారు. ఈ సందర్భంగా విస్తృత ఉపన్యాసం ఇచ్చిన అడ్వకేట్ బాలకృష్ణకు కళాశాల తరఫున అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ విభాగానికి చెందిన అధ్యాపకులు, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.