పిఠాపురం : పిఠాపురం ఈ పేరు ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలా పెద్ద ఫేమస్. అది కూడా జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నానని ప్రకటించినప్పటి నుంచి పిఠాపురం పేరు యావత్ భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో సైతం మారు మోగిపోయింది. ఇక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, విజయం సాధించడం కూడా జరిగింది. కానీ నేటికీ పిఠాపురంలో అభివృద్ధి ఎక్కడ అని భూతద్దం పెట్టి వెతికిన కనబడని స్థితిలో ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపుల నిర్వహణ, మాదకద్రవ్యాలు వంటి వ్యాపారాలు జోరుగా సాగుతున్న సంబంధిత శాఖాధికారులు పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్న తీరు పిఠాపురం ప్రజలను అనేక ప్రశ్నలకు తావిస్తుంది. గత రెండు రోజుల క్రితం పిఠాపురం పట్టణంలో టిడిపి పట్టణ మహిళా అధ్యక్షురాలు భర్త దుర్గాడ లక్ష్మయ్య అలియాస్ జాన్ మైనర్ బాలికపై అత్యాచారం చేయడం, వారిని పోలీసులు అరెస్టు చేయడం పాఠకులకు విధితమే. స్థానిక ఉప్పాడ రైల్వే గేటు వద్ద తెల్లవారుజామున మూడు గంటల నుంచే సారా ఏరులై పారుతున్న అటువైపు కన్నెత్తి చూసే అధికారి లేకపోవడం శోచనీయం. ఏది ఏమైనా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి మాట ప్రక్కన పెట్టినా అన్యాయాలు జరిగే అవకాశం ఎక్కువగా వుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఇలా వుంటే ఇక మిగిలిన నియోజకవర్గాల ప్రజల పరిస్థితి ఏంటని పిఠాపురం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. స్థానిక గోర్స రైల్వే గేటు, మధవపురం రైల్వే గేటు అండర్ గ్రౌండ్ బ్రిడ్జిల వద్ద యువత ఎక్కువగా మద్యం, గంజాయి సేవిస్తూ అక్కడే తిష్ట వేసి అటుగా వెళ్ళే ద్విచక్ర వాహనదారులను, బాటసారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనిపై పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దారి దోపిడీలు ఎక్కువయ్యాయని, సెల్ ఫోన్లు సైతం అపహరణకు గురౌతున్నాయని పట్టణ వాసులు వాపోతున్నారు. ఇక వీటిపై పవన్ కళ్యాణ్ అధికారులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారో వేచి చూడాలి.