సంగారెడ్డి: పట్టుదల ,కృషి తో ఏదైనా సాధించవచ్చన్న దానికి నిదర్శనం మహర్షి భగీరథుడని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు.
వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ వీరారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి, భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు భగీరథుడు గంగను ఆకాశము నుండి భువికి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో, అందుకు ఆయన చేసిన కఠోర శ్రమ గురించి వివరించారు. భగీరథ ప్రయత్నంతోనే గంగ దివి నుండి భువికి వచ్చిందన్నారు.
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని, దేశ సంస్కృతిని సుసంపన్నం చేయడంలో పూర్వం నుండి ఎంతోమంది ఋషులు కృషి చేశారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కుల సమాజం అభివృద్ధి చెందేలా కృషి చేస్తుందన్నారు. మహనీయుల జయంతులు, వర్ధంతు లను చేస్తూ, వారి సమాజాన్ని గుర్తు చేసుకుంటూ వారి అభివృద్ధి, సంక్షేమానికి బాటలు వేస్తున్నారని తెలిపారు.
ఆయా కుల సమాజానికి ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తుందని పేర్కొన్నారు.
ప్రతి వ్యక్తి చదువుతోనే వృద్దిలోకి వస్తారని, విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు.
విద్య ప్రాముఖ్యతను గుర్తించి, తమ పిల్లలను బాగా చదివించి వృద్ధులోకి తీసుకురావాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం సగరు కులస్తులకు రెండు కోట్ల రూపాయలతో ఆత్మగౌరవ భవనం నిర్మిస్తుందని తెలిపారు.
జిల్లా కేంద్రాల్లో సగర సమాజానికి స్థలం కేటాయించి, భవన నిర్మాణం చేయాలని, స్వయం ఉపాధి రంగంలో వారికి కేటాయింపులు చేయాలని సగర కుల ప్రతినిధులు అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
జిల్లా కేంద్రాల్లో సగరకుల భవన నిర్మాణంకు, స్వయం ఉపాధి రంగంలో కేటాయింపులు, తదితర వినతులను మంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఫిరంగి, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి, సూపరిండెంట్ వెంకట నరసమ్మ, రాష్ట్ర సగర సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా సగర సంఘం ప్రధాన కార్యదర్శి నర్వా అంజయ్య, కోశాధికారి వేముల వెంకటయ్య, ఉపాధ్యక్షులు దుంపల రామనారాయణ, సహాయ కార్యదర్శులు గోనె ప్రవీణ్ కుమార్, కొవ్వూరి శ్రీనివాస్, సలహాదారులు శెట్టి వెంకటేశ్వరరావు, మండల శివకుమార్, ఈసీ సభ్యులు నర్వ పండరి, ఉప్పర సమాజ ప్రజలు, అధికారులు, ఉద్యోగులు ,తదితరులు పాల్గొన్నారు.