- ఎస్సీ వర్గీకరణ బిల్లుకు పార్లమెంట్ లో మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
మెదక్ : భారత్ జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని మెదక్ జిల్లా అల్లదుర్గ్ వద్ద మంద కృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు పార్లమెంట్ లో మద్దతు తెలపాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలని రాహుల్ గాంధీని మంద కృష్ణ మాదిగ కోరారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పలు సందర్భాల్లో ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుకుందని, యూపీఏ ప్రభుత్వ హయాంలో జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ను నియమించిందని, అనేక బహిరంగ సభల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి మంద కృష్ణ మాదిగ గుర్తు చేశారు. రాహుల్ గాంధీని కలిసిన వారిలో ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్, ఎంఎస్పీ జాతీయ నేత రాగటి సత్యం మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ తదితరులు ఉన్నారు.