కల్తీ మద్యం 27 మందిని బలిగొంది. మంగళవారం రాత్రి బిహార్‌లోని సారణ్, సివాన్ జిల్లాలకు చెందిన పలువురు కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురయ్యారు. దాంతో బాధితులు ఆయా జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరారు. బుధవారం ఆరుగురు చనిపోయారు. అయితే, గురువారం ఆ సంఖ్య 27కి చేరినట్లు ఎస్‌పీ శివన్ అమితేశ్ కుమార్ తెలిపారు. ఇంకా పలువురు బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఇక ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చాప్రా సూపరింటెండెంట్ ఆశిష్ కుమార్ తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇదిలాఉంటే.. బిహార్‌లో మద్యపాన నిషేధ చట్టం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయినా రాష్ట్రంలో కల్తీ మద్యం ఎలా అందుబాటులోకి వచ్చిందంటూ నీతీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష ఆర్‌జేడీ నిలదీసింది. కల్తీ మద్యం వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమని ఆర్జేడీ నేత మృత్యుంజయ్ తివారీ అన్నారు.