- వైద్య సేవలకు అంతరాయం
- బిక్క వాగు సమీపంలో నిలిచిన 108 వాహనం
- చికిత్స నిమిత్తం గర్భిణీ ఆసుపత్రికి తరలించిన ఎస్సై
కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: గన్నేరువరం, ఇల్లంతకుంట మండలాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చొక్కారావుపల్లె గ్రామ సమీపంలోని బిక్క వాగు ఉప్పొంగింది. అలాగే గన్నేరువరం గ్రామ పెద్ద చెరువు అలుగు పారుతుండడంతో మండల కేంద్రం నుంచి చొక్కా రావు పల్లి గ్రామానికి వెళ్లే రహదారిపై వరద ఉధృతి పెరిగింది. దీంతో రాకపోకలు స్తంభించాయి. కాగా మండల కేంద్రం కి చెందిన మంకాల నాగరాజు తన కుమారునికి కడుపునొప్పి రావడంతో 108 కు కాల్ చేశాడు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన 108 వాహనం గ్రామానికి చేరుకోవడానికి బయలుదేరింది. ఇల్లంతకుంట మండలం పొత్తూరు, గన్నేరువరం మండలం చొక్కారావు పల్లి గ్రామాల మధ్య బిక్క వాగు వరద ఉధృతి ఉండడంతో లో లెవెల్ కల్వర్టుపై వెళ్లే దారి లేక వాగు సమీపంలో నిలిచిపోయింది. దీంతో బాధితులు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన 108 వాహనంలో చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు. అలాగే మండల కేంద్రానికి చెందిన వేముల రవికుమార్ భార్య సుప్రియ గర్భిణి కి పురిటి నొప్పులు రావడంతో స్పందించిన ఎస్ఐ చందా నరసింహారావు తమ వాహనంలో కరీంనగర్ తరలించారు.