భారతీయ జనతా పార్టీలో చేరిన ఆరు గంటల్లోనే మాజీ మంత్రి ఒకరు బహిష్కరణకు గురయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రెబల్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సందీప్‌కుమార్ శనివారం హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే, పార్టీలో చేరడానికి ముందు ఆయన తన పూర్వాపరాలను దాచిపెట్టారని తెలియడంతో హర్యానా బీజేపీ విభాగం సందీప్‌కుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆయనతో పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ పునియా తెలిపారు. కాగా, కుమార్‌తోపాటు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) రాష్ట్ర అధ్యక్షుడు రవిసోను కుండలి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
2016లో ఆప్ నుంచి బహిష్కరణ:
ప్రస్తుతం బీజేపీ బహిష్కరించిన సందీప్‌కుమార్‌ను 2016లో ఆప్ బహిష్కరించింది. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న సందీప్ ఓ మహిళతో అసభ్యకరంగా ఉన్న సీడీ ఒకటి వెలుగులోకి వచ్చింది. సందీప్ తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆ సీడీలో ఉన్న మహిళ ఆరోపించారు. ఇదే కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. దీంతో పార్టీ నుంచి ఆయనను బహిష్కరించారు. 2019లో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న సందీప్ కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీకి మద్దతు తెలిపినందుకు అప్పటి శాసనసభ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ అనర్హత వేటు వేశారు.