భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల :బంగారు తెలంగాణ చేస్తానంటూ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని భాజపా భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ గొలకోటి త్రినాధరావు ఆక్షేపించారు. చర్లలో శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెరాస పాలనలో పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. మిగులు బడ్జెట్ తో ఆవిర్భవమైన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు మయం చేస్తానని ఆశలు రేకెత్తించిన కెసిఆర్ తన కుటుంబానికి పెద్ద ఎత్తున నిధులు కూడ పెట్టారని ఆక్షేపించారు. రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చి ప్రజల సమస్యలను తెరాస ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్నో సంస్కరణల ద్వారా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి దేశంలో సుభిక్షమైన పాలన అందిస్తోందని అన్నారు. అవినీతి పాలనను అంతమొందించాలంటే ప్రజలు నీతివంతంగా, నిబద్ధతగా పనిచేసే మోదీ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రజల సంక్షేమమే పరమావధిగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో తెరాస ప్రభుత్వం వివక్షను ప్రదర్శించడం ద్వారా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలిస్తానని కెసిఆర్ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనులను నమ్మించెందుకు పోడు దరఖాస్తులు తీసుకొని నెలలు గడుస్తున్న పొడుదారులకు హక్కు కల్పించడంలో ముఖ్యమంత్రి వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. గిరిజన సాగులో ఉన్న పోడుభూములకు పట్టాలు ఇవ్వకుంటే భాజపా ఆధ్వర్యంలో భవిష్యత్తు ఉద్యమాలకు శ్రీకారం చుడదామని ఆయన హెచ్చరించారు. చర్లలో మంజూరైన chc కు తక్షణమే నిధులు మంజూరు చేసి వైద్యుల, సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. తెరాస ప్రభుత్వ హాయంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆయుస్మాన్ భారత్ తక్షణమే రాష్ట్రంలో అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. చర్లలో ఎంసిహెచ్ ను మంజూరు చేసి తక్షణమే ఆసుపత్రి భవనానికి నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. సీతమ్మ ప్రాజెక్టు ద్వారా పూర్తి నిరాశ్రయులవుతున్న కోరగడ్డ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లగా కోరెగడ్డ భూములను నమ్ముకొని జీవనం సాగిస్తున్న దళిత, గిరిజన, గిరిజనేతర పేదల బతుకులు సీతమ్మ సాగర్ ద్వారా ఆగమవుతున్నాయని, ప్రభుత్వం కనీసం మానవతా దృక్పథంతో ఆలోచన చేసి తక్షణమే రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కోరేగడ్డ నిర్వాసితుల పక్షాన భాజపా మున్ముందు పోరాటం సాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను, ఆయా భాజపా రాష్ట్రాల్లో పాలనలో అమలవుతున్న సంస్కరణలను చూసి దేశ వ్యాప్తంగా భాజపాకు ఆదరణ పెరుగుతోందని ఆయన అన్నారు. భద్రాచలం రామాలయం అభివృద్ధికి రూ.100 కోట్లను ఇవ్వకుండా కెసిఆర్ ఆ రాముడిని సైతం మోసం చేశారని ఆక్షేపించారు. తెలంగాణలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని ఆయన అన్నారు. భద్రాద్రిపై ఈసారి కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు భవిష్యత్ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని అన్నారు. బూత్ స్థాయిలో పార్టీని పటిష్టపరిచి నూతన జవసత్వాలతో భాజపాను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రం రాజు బెహరా, భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సతీశ్, కిసాన్ మోర్చ నాయకులు సాధo లోకనాదం, పాసిగంటి సంతోష్, పసుమర్తి సతీష్, యువ మోర్చా నియోజకవర్గ కన్వీనర్ నల్లూరి ఉదయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.