కరీంనగర్ పట్టణంలో భారీ నగదు పట్టబడింది. శుక్రవారం రాత్రి డబ్బు తరలిస్తున్నారనే సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీసులకు కళ్లు చెదిరే నోట్ల కట్టలు తారసపడ్డాయి. వెంటనే ఆ నగదును సీజ్ చేసిన అధికారులు సొమ్ము ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే ఇది బీఆర్ఎస్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు సబంధించిందనే ప్రచారం జరుగుతోంది.
రూ.6 కోట్ల 65 లక్షల నగదు..
ఈ మేరకు శుక్రవారం రాత్రి భారీగా డబ్బులు తరలిస్తున్నారనే సమాచారంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమా గ్రూప్ ఆఫ్ కంపెనీలో అర్థరాత్రి తనిఖీలు నిర్వహించారు. హుటాహుటిన అక్కడకు చేరుకొని సోదాలు నిర్వహించగా ఎలాంటి పత్రాలు లేని రూ.6 కోట్ల 65 లక్షల నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. అయితే, ఈ డబ్బు ఎవరిది అనే దానిపై ఆరా తీస్తుండగా ప్రతిమ హోటల్స్‌కు, కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌కు సంబంధాలు ఉన్నట్లు తెస్తోంది.
కోర్టులో డిపాజిట్..
ఇక ఎన్నికల వేళ భారీ మొత్తంలో డబ్బు పట్టుబడటం స్థానికంగా కలకలం రేపుతోంది. లోక్ సభ ఎన్నికల్లో పంచేందుకే తరలిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలన్నీ ప్రతిమ హోటల్ కేంద్రంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా ఈ సీజ్ చేసిన డబ్బులను కోర్టులో సమర్పిస్తామని ఏసీపీ నరేందర్తెలిపారు. సరైన పత్రాలు లేనందున ఈ నగదుమొత్తం కోర్టులో డిపాజిట్ చేస్తామని చెప్పారు.