జులై 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలని పాకిస్థాన్ కేంద్రంగా విధ్వంసాలకు పాల్పడే ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లుగా సమాచారం రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయని సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అమర్నాథ్ యాత్ర కాన్వాయ్, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరగవచ్చునని నిఘా వర్గాల నుండి సమాచారం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఇద్దరు కశ్మీరీ యువకులకు దాడి బాధ్యతలను అప్పగించారట.
రాజౌరీ – ఫూంచ్, పిర్ పంజాల్, చీనాబ్ వ్యాలీ తదితర ప్రాంతాల్లో ఉగ్రదాడికి అవకాశముందని అనుమానిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాడులకు పాల్పడుతారని భావిస్తున్న ఇద్దరు యువకుల గురించి గాలిస్తున్నారు. వారి ఇళ్లు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.