- ఆటోలో ఉన్న 10 మందికి తీవ్ర గాయాలు
- కారులో వున్న నలుగురు మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం…
- మద్యం సేవించి డ్రైవింగ్ చేయటమే ఆక్సిడెంట్ కు కారణమా..?
ముసలి వారు, పిల్లలు , మధ్యవయసు వారు, ఆడ వారు అందరు కుటుంబ సమేతంగా కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని తిరుగు ప్రయాణమై నర్సారావుపేటకు చేరారు. అక్కడనుండి వారి స్వగ్రామమైన కొత్తపుల్లారెడ్డిగూడెం కు ఆటో లో ప్రయాణమయ్యారు. దారి మధ్యలో ఉన్న కారంపూడి కి 10:30 నిమిషాల సమయంలో చేరుకున్నారు. స్టేట్ బ్యాంక్ సెంటర్ కు వచ్చేసరికి ఎదురుగా కారు మితిమీరిన వేగంతో ఆటో ను ఢీ కొట్టింది. ఏం జరిగిందో తెలిసేలోపే ఈ ఘటనతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. అందులో వున్న 11మంది రోడ్డు పై చల్లా చదురుగా పడి తీవ్ర గాయాలు పాలైనారు. కారు ముందు భాగం నుజ్జు అయి కారు లో ముందు సీట్ కు వున్న ఎయిర్ బాగ్స్ ఓపెన్ అయినవి. కారు లో వున్న నలుగురు కింద పడ్డారని స్థానికులు తెలిపారు. ఆ సమయానికి అక్కడ వున్న స్థానికులు ఆటో వద్దకు వచ్చి క్షతగాత్రులను 108 వాహనం ద్వారా నరసరావుపేట లోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమా..?
ప్రమాద ఘటనలో వున్న స్థానికులు తెలిపిన సమాచారం మేరకు కారు అతి వేగమే కారణమని విలేకరులకు తెలిపారు. కారు లో 4 గురు ఉన్నారన్నారు. అందరు మద్యం సేవించి ఉన్నారని తెలిపారు. మద్యానికి యువత బానిసలుగా మారారన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వలన ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఆటో లో ముసలి వారు, చిన్న పిల్లలు, ఆడ వారు ఉన్నారని, వారికి తీవ్ర గాయాలు అయ్యాయి అని, కొంతమందికి కాళ్ళు విరిగాయని స్థానికులు తెలిపారు. ప్రమాద ఘటనకు సీఐ దార్ల జయకుమార్ వచ్చి క్షత గాత్రులను 108లో వైద్య శాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బాధిత గిరిజన కుటుంబాలను ఆదుకోవాలి
ప్రమాదానికి గురైన కుటుంబాలు గిరిజన కుటుంబాలని, అందరు వ్యవసాయ కూలీలని బాధిత సంబంధీకులు తెలిపారు. కాయకష్టం చేసుకొని పొట్ట నింపుకొనే కుటుంబాలని తెలిపారు. గాయపడిన వారిలో కుటుంబాన్ని పోషించుకునే కుటుంబ పెద్ద, యుక్త వయసుకు వచ్చిన మగ పిల్లలు, చిన్న బాలికలు ఉన్నారని తెలిపారు. బాధిత గిరిజన కుటుంబాలను ఆదుకోవాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన వ్యక్తిని, అదేవిధంగా మద్యం సేవించి కారులో వున్న మరో ముగ్గురును చట్టపరంగా శిక్షించాలని బాధిత కుటుంబ సంబంధీకులు కోరుతున్నారు.