కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నిలిపివేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా మధ్యాహ్నం భోజన వంట చేసే కార్మికులు సమ్మె చేయడంతో భోజనాన్ని నిలిపివేశారు.జడ్పీ పాఠశాలలో 210 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం లేక కొంతమంది ఇంటి వద్ద నుండి టిఫిన్ బాక్సులలో అన్నం తెచ్చుకుని చెట్ల కింద భోజనం చేశారు. కొంతమంది విద్యార్థులు భోజనం లేక ఇంటికి వెళ్లలేక కడుపు మార్చుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేసే మధ్యాహ్న భోజన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను పేద విద్యార్థులకు ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మధ్యాహ్న భోజన వంట కార్మికులతో చర్చించి విద్యార్థులకు భోజనం అందించేలా చూడాలని కోరుతున్నారు.