తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈ నెల 26న గుర్తుతెలియని వ్యక్తి మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రంగంపేట పోలీస్ స్టేషన్లో రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ కిశోర్ కుమార్ మీడియాకు వివరాలను వెల్లడించారు.
రంగంపేట మండలం వీరంపాలెం గ్రామానికి చెందిన కేతమళ్ల వెంకటేశ్వరరావు (పూసయ్య) వీరంపాలెంలో ధాన్యం వ్యాపారం చేస్తుంటాడు. ఇతను వివిధ అవసరాల నిమిత్తం తీర్చలేనన్ని అప్పులు చేశాడు. తాను చనిపోయినట్టు చిత్రీకరించుకుని కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళితే తన పేరిట రూ.40 లక్షల బీమా సొమ్ము వస్తుందని భావించాడు. ప్రమాదవశాత్తు మరణించినట్టు అందరినీ నమ్మించడానికి ప్రణాళిక రూపొందించాడు. అతని స్థానంలో వేరే మృతదేహాన్ని ఉంచి ఎవరూ గుర్తించకుండా తాను చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేయాలని భావించాడు. గుర్తుతెలియని మృతదేహం కోసం రాజమహేంద్రవరానికి చెందిన తన స్నేహితుడుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
పూసయ్య అతడి స్నేహితులు 25వ తేదీ అర్థరాత్రి రాజమహేంద్రవరంలోని పాతబొమ్మూరు శ్మశానవాటికలో పూడ్చిన శవపేటిక నుంచి మృతదేహాన్ని దొంగిలించి ఒక కారులో రంగంపేట మండలం వీరంపాలెం తరలించారు. అక్కడకు చేరుకున్నాక ఓ పొలంలో పెట్రోలు పోసి తగలబెట్టారు. పూసయ్య పాదరక్షలు, సెల్‌ఫోన్‌ను అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. ఆధారాలను బట్టి మృతదేహం పూసయ్యదేనని భావించి పోస్టుమార్టం కోసం తరలించారు.
భర్త మృతి చెందాడని భావించిన పూసయ్య భార్య భాదతో తానూ చనిపోతానంటూ రోదించారు. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న పూసయ్య బాధపడుతున్న భార్యకు విషయం ఎలాగైనా చెప్పాలని భావించాడు. దీంతో మరో పథకాన్ని రూపొందించాడు. కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు పొలంలో ఓ మృతదేహాన్ని కాలుస్తుండగా తాను అడ్డుకున్నానని దీంతో వారు అతన్ని కొట్టి దూరంగా తీసుకెళ్లి తుప్పల్లో పడేసినట్టు ఓ కథ చెప్పాడు. అయితే తమ విచారణలో పూసయ్య చెబుతున్నది అబద్దం అని పోలీసులు గ్రహించారు. దీంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పాడు.
కేసులో పూసయ్య ప్రధాన నిందితుడని తేలడంతో అతనితో పాటు అతనికి సహకరించిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహం తరలించిన కారుతోపాటు రెండు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. వారు తీసుకువచ్చిన మృతదేహం వివరాలను తెలుసుకొని శవ పంచనామా అనంతరం బంధువులకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును త్వరితగతిని ఛేదించిన అనపర్తి సీఐ శివ గణేష్, రంగంపేట ఎస్సై విజయ్ కుమార్‌లను జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.