మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తమ భూమి కబ్జాకు గురైందంటూ ఓ కుటుంబం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ సమీపంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళితే పట్టణంలోని రాంనగర్ బస్తీకి చెందిన ఆవుల కొమురయ్య అనే వ్యక్తి తమ భూమి కబ్జా చేసాడంటూ అదే బస్తికి చెందిన గోలి సుష్మ, సుకుమార్ దంపతులు తమ కుమారుడు బిట్టుతో సహా వాటర్ ట్యాంక్ ఎక్కారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ శంకరయ్య, టూ టౌన్ సీఐ రాజ్ కుమార్, వన్ టౌన్ ఎస్ ఐ రాములు, టూ టౌన్ ఎస్ఐ ఆంజనేయులు సిబ్బందితో అక్కడకు చేరుకొని బాధితులకు సర్ది చెప్పి క్రిందకు దింపే ప్రయత్నం చేసారు. వారు ఎంతకు దిగకపోయే సరికి అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి వారితో పాటు టూ టౌన్ ఎస్ఐ ఆంజనేయులు వాటర్ ట్యాంక్ ఎక్కే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా వారిపై దాడిచేసాయి, బాధితులకు క్రిందకు దింపి ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.