తిరుపతి, మే-23 : తుపాకులు, నల్లమందుతో జంతువులను వేటాడేందుకు అడవుల్లోకి చొరబడిన 7గురిని టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు డీఎస్పీ చెంచురాజు ఆదేశాలను ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన లింగాధర్ టీమ్, అటవీ శాఖ సిబ్బందితో కలసి మంగళవారం సానిపాయ టాస్క్ ఫోర్సు క్యాంపు నుంచి ఎర్రచందనం స్మగ్లర్ల కోసం బయలుదేరారు. వీరు పింఛా సెక్షన్, జిల్లేలమంద బీటులోని దయ్యాల పెంట ప్రదేశంలో కూంబింగ్ చేపట్టారు. రాతిదొన ప్రదేశంలో కొంత మంది వ్యక్తులు ఉండటాన్ని గమనించారు. వారిని చుట్టుముట్టగా, వారు 7గురు ఉన్నట్లు గుర్తించారు. వీరి వద్ద ఒక నాటు తుపాకీ, నల్లమందు, రవ్వలగుండ్లు, మందు చిత్తి ఉన్నాయి. వీరిని అన్నమయ్య జిల్లా రాయవరం గ్రామానికి చెందిన పాముల సాయి (30), మదుంపాడు గ్రామానికి చెందిన బెల్లంకొండ సురేంద్ర (52), పాగ మురళి (40), బోడక దేవేంద్ర (25), పసుపులేటి భాస్కర్ (53), కడప టౌన్ కు చెందిన చిప్పల సాయికుమార్ (23), షేక్ హుస్సేన్ (37)లుగా గుర్తించి, వారిని అరెస్టు చేశారు. నాటు తుపాకీలో ఒక రౌండు కాల్పులు జరిగినట్లు గుర్తించారు. ఒక దుప్పిని వేటాడినట్లు, అయితే అది తప్పించుకుని పోయినట్లు నిందితులు తెలిపారు. నాటు తుపాకీ, మందు సామగ్రిలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.