హైదరాబాద్ : ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బ్రోకర్ మాటలతో అధికారం చేపట్టారన్నారు. గత పదిహేను నెలల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అధికార కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి, ఇతర నేతలకు పడటం లేదన్నారు.
ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ 100 సీట్లు గెలుచుకుంటుందని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. హామీలను నెరవేర్చకుండానే, అమలు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. అభివృద్ధి పథకాల పేర్ల మార్పుతోనే ఎంతో అభివృద్ధి చేశామని చెప్పడం విడ్డూరమని ఆయన అన్నారు.
తేదీల్లో మార్పు, దేవుళ్ల మీద ఒట్లు పెట్టడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు అని విమర్శించారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లేక ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ చేయడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం లేకుండానే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనకు వస్తానని చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరు జెడ్పీటీసీలు బీఆర్ఎస్‌కే రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ నేతలను నిలదీయాలని సూచించారు.