contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బిఆర్ఎస్ కి షాక్.. ఎంపీ అభ్యర్థి సీటిస్తామంటున్నా వద్దంటున్న నేతలు !

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ బిఆర్ ఎస్ పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి .. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టికెట్ హామీ ఇస్తే చాలు.. అటు కాంగ్రెస్, బీజేపీలోకి బీఆర్ఎస్ నుంచి పెద్దపెద్ద నేతలు రాత్రికి రాత్రే జంప్ చేస్తున్నారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించిన సీనియర్ నేతల్లో చాలామంది ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోగా, కాంగ్రెస్‌లో టికెట్ రాదనుకున్న మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఇప్పటికే ప్రజాదీవెన సభను ప్రకటించటంతో బాటు చేరికలతో బిజీబిజీగా ఉంది. 17 స్థానాల్లో 10 స్థానాల మీద ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి అభ్యర్థుల పేర్లను పార్టీ హైకమండ్‌కు పంపినట్లు సమాచారం. అలాగే.. అటు బీజేపీ సైతం 9 మంది అభ్యర్థులను ప్రకటించి బరిలో తాను ఉన్నట్లు సందేశాలు పంపుతోంది. కానీ.. గులాబీ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థులతో మాట్లాడే పనిలోనే ఉంది.

ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ పార్టీని కలవర పెడుతున్నాయి. నిన్నటి దాకా తన దర్శనం కోసం పడిగాపులు కాసిన నేతలంతా ఇప్పుడు వేరే పార్టీలో చేరిపోవటం, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దిక్కులు చూడటంతో కేసీఆర్‌ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో హైదరబాద్ పరిధిలోని దాదాపు అన్ని సీట్లు గెలుచుకుని ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఆ పార్టీకి నేడు లోక్‌సభ అభ్యర్థులు కరువవయ్యారు. అధికారంలో ఉండగా అన్నీ తానై వ్యవహరించిన కుమారుడు కేటీఆర్.. విపక్షంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పార్టీని కాపాడుకోలేకపోవటం, హరీష్ రావు సైతం కేవలం తన జిల్లా రాజకీయాలకే పరిమితం కావటంతో కేసీఆర్ మళ్లీ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.హామీల‌ను అమ‌లుతో జనంలో సీఎం రేవంత్ రెడ్డికి రేటింగ్ పెరగటం, గత పాల‌న‌లోని లొసుగులపై అసెంబ్లీ వేదిక‌గా సీఎం విజృంభించటంతో ఎన్నికల వేళ గులాబీ బాస్ కలవర పడుతున్నారు.

లోక్‌సభ సీట్ల విషయానికొస్తే.. ఎంపీగా పోటీచేయాలంటే వంద కోట్లైనా ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి ఉంది. దీంతో దీనికోసం పోటీపడే వ్యాపారవేత్తలు, సంపన్నులు తమ ప్రయోజనాలు నెరవేరాలని కోరుకోవటం సహజమే. అయితే.. పార్టీ ఓటమితో పాత నేతలెవరూ ఇప్పుడు ఎంపీ సీటు మాకొద్దంటే మాకొద్దని దూరంగా ఉంటున్నారు. గతంలో కేసీఆర్‌తో రాసుకుపూసుకు తిరిగి, పోటీకి ఉవ్విళ్లూరిన కొందరు సంపన్నులు సైతం మొహం చాటేయటం ఆ పార్టీని కలవరపరుస్తోంది.

రాష్ట్రంలో అధికారం పోయినా, తనకున్న పది ఎంపీ సీట్లలోనైనా నిలుపుకోగలమని నిన్నటి వరకు భావించగా, ఆ పదిమందిలో ముగ్గురు వేరే పార్టీలోకి వెళ్లిపోయారు. వీరిలో నాగర్ కర్నూల్ ఎంపీ రాములు.. కుమారుడు భరత్‌కు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కి బీజేపీ సీటు కూడా ఇచ్చేసింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు.. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌ తరపున మల్కాజిగిరి లోక్‌సభ సీటులో పోటీ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఇక.. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ సీటులో బొంతు శ్రీదేవి కాంగ్రెస్ నుంచి నిలిచే అవకాశముందనే వార్తలూ వినిపిస్తున్నాయి. మరోవైపు చెవెళ్ల పార్లమెంటు బరిలో ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ ఎంపీ సీటుకు కాంగ్రెస్ సీటులో వంశీచంద్ రెడ్డి నిలబడతారనే స్పష్టత రానే వచ్చింది. నిన్నటిదాకా.. ‘దోస్త్ మేరా దోస్త్’ అని పాడిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సొంత సీటులో మారిన రాజకీయాలతో కేసీఆర్ పేరే ఎత్తటం లేదు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 10 సీట్లలో కాంగ్రెస్ 4, బీజేపీ 4 గెలుచుకోగా, బీఆర్ఎస్ బలం 2 సీట్లకు పడిపోయింది. పైగా ఈ రెండు నెలల్లో అక్కడి అనేక గ్రామ, మండల, స్థానిక సంస్థల సభ్యులు కాంగ్రెస్‌లో చేరిపోవటంతో అక్కడ అభ్యర్థిగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. పెద్దపల్లి సీటులో కొప్పుల ఈశ్వర్‌ను ఆదివారం రోజు ప్రకటించినా.. ఆయన బలిపశువు కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్థానంలో వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీ, సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతల్లో ఒకరు ఇక్కడ బరిలో నిలవటంతో వారి ముందు ఈశ్వర్ నిలవలేరనే వాదన వినిపిస్తోంది.

నిజామాబాద్ సీటులో గతంలో పోటీ చేసిన కుమార్తె కవిత సైతం పోటీకి సిద్ధపడకపోవటం, అక్కడ పార్టీ ప్రాభవం బొత్తిగా తగ్గిపోవటంతో మరెవరూ ఆ సీటు అడిగిన పాపాన పోలేదు. బండి సంజయ్ సిట్టింగ్‌గా ఉన్న కరీంనగర్‌ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో 4 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్ గెలిచాయి. బిఆర్ఎస్ సీట్లలో కేటీఆర్ గెలిచిన సిరిసిల్ల కూడా ఉంది. కానీ.. అక్కడ పార్టీ తరపున ఎవరూ ఆసక్తి చూపకపోవటంతో బి. వినోద్ కుమార్‌ను దింపక తప్పలేదు.

మెదక్ ఎంపీ సీటు పరిధిలోని 7 స్థానాల్లో కేవలం మెదక్ సీటు తప్ప అన్నీ బీఆర్ఎస్ గెలుచుకుంది. కానీ.. ఆ సీటును కేసీఆర్ కుమార్తె కోరుకోవటంతో లోకల్‌గా ఉన్న అభ్యర్థులంతా వ్యతిరేకిస్తున్నారు. హరీష్ రావు సైతం దీనికి నో చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇక్కడ నీలం మధును కాంగ్రెస్ బరిలో దించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జహీరాబాద్ ఎంపీ పరిధిలోని సెగ్మెంట్లలో 4 కాంగ్రెస్ చేతిలో, ఒకటి బీజేపీకి దక్కగా బీఆర్ఎస్ బాన్స్‌వాడ, జహీరాబాద్ సీట్లకే పరిమితమైంది. దీంతో అక్కడా సీటు తీసుకునేందుకు ఎవరూ సాహసించటం లేదు.

నల్గొండ, భువనగిరి, ఖమ్మం సీట్ల కోసం ఒక్క దరఖాస్తు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి ఖమ్మం, నల్గొ్ండ జిల్లాల్లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కాంతారావు కాంగ్రెస్ బాట పట్టటంతో అక్కడ నామా నాగేశ్వరరావును పోటీ చేయమని బతిమాలుకుంటున్నట్లు సమాచారం. నల్లగొండ, భువనగిరి సీట్లలో కాంగ్రెస్ గెలుపు ఖాయంగా కనిపిస్తోండటంతో బీ ఫామ్ కోసం ఎవరూ ముందుకు రావటం లేదు.

అటు మెండుగా బలమున్న మహబూబ్ నగర్ సీటు, వరంగల్లు, మహబూబాబాద్‌లోనూ అదే పరిస్థితి. వరంగల్లు సీటు కోసం బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి రాజయ్య ప్రయత్నిస్తుండగా, మహబూబాబాద్ సీటు ఎవరు నిలిచినా కాంగ్రెస్ ఖాతాలోకేననే విశ్లేషణ వినిపిస్తోంది. సిటీలోని సికింద్రాబాద్ సీటు నుంచి తలసాని సాయిని బరిలో దించాలని పార్టీ భావిస్తుండగా, ఇప్పటికే ఒకసారి అక్కడ ఓడిన తన కుమారుడు మళ్లీ ఓడితే అతడికి రాజకీయ భవిష్యత్తే లేకుండా పోతుందని తలసాని శ్రీనివాస యాదవ్ ఈ ప్రతిపాదనకు పెద్దగా ముందుకు రానట్లు సమాచారం.

మరి ఈ ప్రస్తుత పరిస్థితిలో పార్టీని నిలబెట్టుకోవటం ఎలా? మునుపటిలా రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం ఎలా? ఈ ఎన్నికల్లో సత్తా చాటలేకపోతే.. మరో 5 ఏళ్ల నాటికి పార్టీ నామరూపాల్లేకుండా పోయేలా ఉందనేది కేసీఆర్ భయం. కానీ.. ఎన్నిరకాలుగా ఆలోచించినా అందుకు ఎలాంటి దారీ కనిపించటం లేదు. ఒక్క ఓటమి ఇంత తక్కువ సమయంలో పరిస్థితిని ఇంతగా దిగజార్చుతుందా? ?

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :