మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని రిటర్ణింగ్ అధికారి కార్యాలయం సమీపంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
ఒకే సమయంలో నామినేషన్ వేసేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి రావడంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
నామినేషన్ వేయడానికి తొలుత వివేక్ వెంకటస్వామి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బాల్క సుమన్ వాహనం లోపలికి వెళ్లడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ సైతం పోలీసు అధికారితో వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలు నేతల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.