- రాష్ట్ర కో-ఆర్డినేటర్ గుమ్మపు చిత్రశ్రీను
పిఠాపురం : మంగళవారం ఉదయం పిఠాపురం పట్టణంలోని కత్తులగూడెం ఎస్సీ పేటలోని అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జి ఖండవల్లి లోవరాజు అధ్యక్షతన బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గుమ్మపు చిత్రశ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలతో ఏర్పాటైన బహుజన సమాజ్ పార్టీ విధి విధానాలు క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ప్రతీ ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. బహుజనులపై కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. రాబోయే పంచాయితీ, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ల ఎన్నికల్లో పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తుందన్నారు. అందుకు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గం, మండలాలలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బీఎస్పీ నియోజకవర్గం బీసీ అధ్యక్షుడుగా డా. సునీల్ కుమార్ యాండ్ర, కన్వినర్లుగా పెయ్యల నూకరాజు, యాండ్ర ఆనంద్ విష్ణుకుమార్, పిఠాపురం పట్టణ అధ్యక్షుడిగా సికోలు శ్రీను, పట్టణ వైస్ ప్రెసిడెంట్ గా బర్రె చిన్నబ్బాయిలను నియమించారు. నియామకమైన కమిటీ సభ్యులందరిని పార్టీ కండువా కప్పి సత్కరించారు. నియమితులైన సభ్యులందరూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం (సుబ్బుభాయ్), కాకినాడ జిల్లా ఇన్చార్జి సబ్బారపు అప్పారావు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.