టిడిపి పార్టీ రోడ్ షోలు, సభలను నిర్వహించకుండా అడ్డుకునేందుకే ముఖ్యమంత్రి జగన్ చీకటి జీవోను తీసుకొచ్చారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. చీకటి జీవోను తీసుకొచ్చేందుకు 11 మందిని జగన్ చంపించారని అన్నారు. విజయవాడలో బుద్ధా వెంకన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేకే జగన్ రెడ్డి తొక్కిసలాటలను సృష్టించారని అన్నారు. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు చేస్తున్న విమర్శలతో జగన్ మానసిక స్థితి దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. వైసీపీకి అంతిమ ఘడియలు దగ్గరపడ్డాయని గ్రహించి, మారణహోమం సృష్టిస్తున్నారని చెప్పారు.
మరోవైపు చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజుకు చేరుకుంది. నిన్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో, ఆయన పాదయాత్రగా గ్రామాల్లో తిరిగారు. ఈ క్రమంలో, జీవో నెంబర్ 1ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉండటందో… ఆ పార్టీకి చెందిన కీలక నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయం వద్ద కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.