ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసింది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్టమెంట్స్ కింద తొలి విడతగా రూ.113 కోట్లు విడుదల చేసింది. తొలి విడత నిధుల్లో 75 శాతం వినియోగించిన అనంతరం తదుపరి విడత నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ నిధులతో అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
మౌలిక వసతులతో పాటు పర్యాటకుల్ని ఆకర్షించేలా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టులపై కేంద్రానికి ఇప్పటికే డీపీఆర్ సమర్పించినట్టు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం తదితర ప్రాజెక్టులకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. గండికోటను ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.