నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. టీడీపీ అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 174 కింద కందుకూరు పీఎస్ లో కేసు నమోదయింది. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరపనున్నారు. ప్రమాద కారణాలపై ఆరా తీయనున్నారు.
మరోవైపు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలను అంబులెన్సుల్లో వారి స్వగ్రామాలకు తరలించారు. మృతుల కుటుంబాలను చంద్రబాబు స్వయంగా పరామర్శిస్తున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు టీడీపీ నేతలు ఆయా గ్రామాల్లోనే ఉండాలని ఆదేశించారు. మృతుల కుటుబాలకు రూ. 10 లక్షల చొప్పున సాయం అందించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబాల పిల్లలను చదివించే బాధ్యతను తీసుకుంటామని ప్రకటించారు.