contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఐఏఎస్ లకు చుక్కెదురు… డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలు పాటించాలన్న CAT

అధికారులు తాము ప్రస్తుతం విధులు నిర్వర్తించే చోటే కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించిన తెలంగాణ, ఏపీ ఐఏఎస్ అధికారులకు చుక్కెదురైంది. వారి పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది.

గతంలో ఏపీకి కేటాయించినా ఇంకా తెలంగాణలోనే విధులు నిర్వర్తిస్తున్న ఆమ్రపాలి, వాణీప్రసాద్, వాకాటి కరుణ… తెలంగాణకు కేటాయించినా ఏపీలో విధులు నిర్వర్తిస్తున్న సృజనను తమ సొంత క్యాడర్ రాష్ట్రాలకు వెళ్లాల్సిందిగా ఇటీవల డీవోపీటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే, డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ పై నలుగురు ఐఏఎస్ లు క్యాట్ లో పిటిషన్లు దాఖలు చేశారు. డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని క్యాట్ ను కోరారు.

ఈ పిటిషన్లపై క్యాట్ నేడు విచారణ చేపట్టింది. ఐఏఎస్ అధికారుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతున్నామని వారు క్యాట్ కు విన్నవించారు. ఈ నెల 16న రిలీవ్ కావాలని డీవోపీటీ ఆదేశాలు ఇచ్చిందని, అయితే, హైకోర్టు ఆదేశాల మేరకు ఐఏఎస్ ల అభ్యర్థనను డీవోపీటీ పరిశీలించాలని న్యాయవాదులు కోరారు.

డీవోపీటీ నేరుగా నిర్ణయం తీసుకోకుండా, ఏక సభ్య కమిటీని నియమించిందని, కానీ, ఐఏఎస్ ల కేటాయింపుపై నిర్ణయాధికారం డీవోపీటీకే ఉంటుందని వారు స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఏక సభ్య కమిటీ సిఫారసును డీవోపీటీ ఎలా అమలు చేస్తుందని న్యాయవాదులు ప్రశ్నించారు.

ఏక సభ్య కమిటీ డీవోపీటీకి ఇచ్చిన నివేదికను ఐఏఎస్ లకు ఇవ్వలేదని వారు క్యాట్ దృష్టికి తీసుకెళ్లారు. కమిటీ నివేదికను ఐఏఎస్ అధికారులకు ఇవ్వకుండానే డీవోపీటీ ఉత్తర్వులు ఇచ్చిందని ఆరోపించారు.

ఈ వాదనలు విన్న క్యాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వరదల కారణంగా ఏపీలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, అలాంటప్పుడు ఏపీకి వెళ్లి వరద ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేయాలని లేదా? అని సూటిగా ప్రశ్నించింది.

డీవోపీటీ ఏక సభ్య కమిటీని నియమించినప్పుడే ఐఏఎస్ లు ఎందుకు స్పందించలేదని నిలదీసింది. ఎందుకు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయలేదని క్యాట్ ప్రశ్నించింది. ఇలాంటి పరిస్థితుల్లో డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :