కేంద్ర బడ్జెట్ 2023 – 2024 కి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో రూ.45.03 లక్షల కోట్ల వ్యయంతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.
అమృత కాలంలో వస్తున్న తొలి బడ్జెట్ ఇది… పురోగామి భారత్ కు ఈ బడ్జెట్ పునాది వేస్తుందని అభిప్రాయపడ్డారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతులతో కూడిన ఆశావహ సమాజం కలలను సాకారం చేసే బడ్జెట్ అని అభివర్ణించారు. అభివృద్థి పథంలో పయనిస్తున్న భారత్ కు ఈ బడ్జెట్ కొత్త శక్తిని అందిస్తుందని మోదీ పేర్కొన్నారు.
సంప్రదాయరీతిలో తమ చేతులతో శ్రమిస్తూ దేశ అభ్యున్నతికి పాటుపడుతున్న ‘విశ్వకర్మ’లు నవభారత సృష్టికర్తలు. అలాంటి ‘విశ్వకర్మ’ల కోసం తొలిసారిగా శిక్షణ, మద్దతులతో కూడిన ఓ పథకాన్ని నేటి బడ్జెట్ లో ప్రకటించామని వెల్లడించారు.