బెల్లంపల్లి: నెహ్రూ యువ కేంద్రం యువజన సర్వీసులు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆదిలాబాద్ వారి ఆధ్వర్యంలో బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల బాలురు (సిఓఈ) లో శుక్రవారం విద్యార్థిని విద్యార్థులు మరియు యువకులకు జిల్లాస్థాయి నైబర్హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి సుశీల్ బాద్ గారు ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు గారు, డిగ్రీ కళాశాల లెక్చరర్ సోషల్ వర్కర్ గజల్లి మోహన్ గారు, అధ్యాపకులు రవి, రాజేందర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 150 మంది యువత, విద్యార్థులు పాల్గొన్నారు.
అవగాహన కల్పించేందుకే…
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సుశీల్ బాద్ గారు మాట్లాడుతూ, ఎన్ వై కే ఆధ్వర్యంలో ప్రస్తుత 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి నైబర్హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమము నిర్వహిస్తున్నామని తెలిపారు. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లలో నిర్వహించామని, ఈరోజు మంచిర్యాల జిల్లాలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం జి20 శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం భారతదేశానికి వచ్చిందని దీనిలో భాగంగా ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో న్యూఢిల్లీలో 2023 సెప్టెంబర్ 9, 10 తేదీలలో ఈ సమావేశము జరుగుతుందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఈ సమావేశంలో చర్చించే అంశాలపై యువతకు అవగాహన కల్పించడం కొరకు యూత్ పార్లమెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. యువత దేశాభివృద్ధిలో కీలకమని యువత అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ఎన్ వై కే ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత శిబిరాలు యువజన క్రీడా కార్యక్రమాలు శ్రమదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
అందరికీ సంకల్పం ఉండాలి…
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఐనాల సైదులు మాట్లాడుతూ, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. మరి మనం మనుషులం మనకు చైతన్యం మానవత్వం సమాజం పట్ల, దేశం పట్ల అవగాహన అభివృద్ధి చెందాలని సంకల్పం ప్రతి ఒక్కరికి ఉండాలని అన్నారు. యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్నారు. మన కళాశాల విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో అనేక మెడల్స్ సాధించారని తెలిపారు. అనేక మందికి మెడిసిన్, ఇంజనీర్ లలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో సీట్లు వచ్చాయని తెలిపారు. అదేవిధంగా ఇతర విద్యార్థులు కూడా మిగతా విద్యార్థులు కూడా సాధించాలని పిలుపునిచ్చారు.
ప్రాపంచిక దృక్పథం ఉండాలి…
డిగ్రీ కళాశాల లెక్చరర్, సోషల్ వర్కర్ గజల్లి మోహన్ మాట్లాడుతూ, యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం వై20 పేరుతో యువజనులలో చైతన్యం తేవడానికి ప్రాపంచిక దృక్పథం (గ్లోబల్ ప్రోస్పెక్టివ్) అనే థీమ్ తీసుకుందని తెలిపారు. యువత ఆలోచనలు ప్రాపంచిక దృక్పథంతో ఉండాలని పేర్కొన్నారు. మనం ప్రపంచ పౌరులం, ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సంస్కృతి, మహిళా సాధికారత, పర్యావరణం మొదలైన అంశాలపై అవగాహన చేసుకుని అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. అనంతరం యూత్ పార్లమెంట్ నిర్వహించారు. దీనిలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ పై డిబేట్ నిర్వహించి అందరూ పాల్గొన్నారు. అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు