contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నాలో ప్రవహించేది కూడా సీమ రక్తమే .. పాపాల పెద్దిరెడ్డి దోచిందంతా కక్కిస్తా: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ / చిత్తూర్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్, మంత్రులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాటు దోచుకున్న సొమ్ముతో ‘సిద్దం’ అంటూ జగన్ రెడ్డి ప్రచార సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డిని ఇంటికి పంపేందుకు రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు సిద్దంగా ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో జగన్ ముద్దులకు మురిసిపోయి ఓట్లేశారని, కానీ ఈ ప్రాంతంలో జగన్ చేసిన అభివృద్ది ఏంటి? ఒక్క ప్రాజెక్టు కట్టాడా, ఒక్క పరిశ్రమ తెచ్చాడా? అని నిలదీశారు.

“నేను కూడా రాయలసీమ బిడ్డనే… నాలో ప్రవహించేది సీమ రక్తమే. టీడీపీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 12,500 కోట్లు ఖర్చు చేశాం. ఈ 5 ఏళ్లలో జగన్ రెడ్డి ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? పీలేరు, పుంగనూరుకి నీళ్లొచ్చాయా? రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి.

తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులు టీడీపీ హయాంలో ప్రారంభమైనవే. వాటిని పూర్తి చేసే బాధ్యత టీడీపీదే. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు శ్రీశైలం ద్వారా 120 టీఎంసీలు ఇచ్చిన ఘనత టీడీపీదే. టీడీపీ ఉంటే గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకొచ్చే వాళ్లం.

ప్రతి సంవత్సరం 2 వేల టీంఎసీ గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. తవ్విన కాలువలు పూర్తి చేసి ఈ నీటిని తెస్తే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది. రాయలసీమను పండ్ల తోటలకు హబ్ గా చేయాలని కృషి చేశా. దుర్మార్గులు అంతా నాశనం చేశారు.

నాడు 90 శాతం సబ్సిడితో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 40 మంది చనిపోయారు. 450 ఇండ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు ఆ డ్యాం కట్టారా? బాధితులకు ఏం న్యాయం చేశారు? ప్రాజెక్టు గేట్లకు గ్రీసు వేయలేని సీఎం 3 రాజధానులు కడతారా? ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి రూ. 1 లక్ష చొప్పున ఇచ్చాం” అని చంద్రబాబు వివరించారు.

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దోపిడీకి అడ్డూ, అదుపు లేదు!

వైసీపీలో ఒక్కరైనా విలువల గల మంత్రి ఉన్నారా? టూరిజం మంత్రిని చూస్తే, వాళ్ల కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవుల కోసం డబ్బులు తీసుకున్నారు. పాపాల పెద్దిరెడ్డి అన్నం తినడం లేదు, ఆయనకు టిఫిన్ ఇసుక, లంచ్ మైన్స్, డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు! బకాసురుడిని మించిపోయాడు పెద్దిరెడ్డి. పుంగనూరులో ఈసారి పెద్దిరెడ్డి గెలవడు. ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు అనవసరం. పుంగనూరులో టీడీపీ జెండా ఎగురుతుంది. నా దయాదాక్షిణ్యాల వలన పెద్దిరెడ్డి గెలిచారు. కానీ ఇప్పుడు ఆయన ఎలా గెలుస్తారో చూస్తాను.

రేపు నీ వద్ద అధికారం ఉండదు పెద్దిరెడ్డీ… అప్పుడేం చేస్తావ్?

వైసీపీ పాలనలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం, పెద్దిరెడ్డి దోపిడీని బహిర్గతం చేస్తే అంగళ్లులో మన మీద దాడి చేసి 600 మందిని జైల్లో పెట్టారు. పెద్దిరెడ్డి పోలీసులు లేకుండా ఇంట్లో నుంచి బయటకు రాలేదు. కాని రేపు నీ దగ్గర అధికారం ఉండదు… అప్పుడు నిన్ను శిక్షించే బాధ్యత టీడీపీదే. పులివెందుల్లో కూడా మీ సైకో గెలవడని జగన్ కు చెప్పు పెద్దిరెడ్డీ!

బెరైటీస్ అంతా ఊడ్చేశారు… ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు. ఆవులపల్లి రిజర్వాయర్ కట్టి రూ. 600 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు, ఈయన పాపాలకు ఎన్జీటీ రూ. 100 కోట్ల జరిమానా వేసింది. శివశక్తి డైరీతో పాడి రైతుల్ని దోచుకుంటున్నారు. పాపాల పెద్దిరెడ్డి రూ. 35 వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడి చేశారు. దోచిన డబ్బంతా కక్కిస్తాం.

రాజకీయనేతలా… బందిపోట్లా!

పెద్దిరెడ్డి ఆయన కొడుకు, తమ్ముడు బందిపోట్ల మాదిరి తయారయ్యారు. తంబళపల్లెలో ఎక్కడ స్థలం కనపడితే దాన్ని కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారు. పీలేరు ఎమ్మెల్యే పీలేరును పీల్చి పిప్పి చేస్తున్నాడు. పీలేరు, కలిగిరి, గుర్రం కొండ మైనింగ్ లో ఈయనే భాగస్వామి. రూ.400 కోట్ల విలువైన భూముల్ని, రూ. 500 కోట్ల విలువైన ఇసుకను దోచుకున్నారు.

మదనపల్లె, రాజంపేట ఎమ్మెల్యేలను మార్చారు. కానీ పాపాల పెద్దిరెడ్డిని ఎందుకు మార్చలేదు? రైల్వే కోడూరు ఎమ్మెల్యే మంగపేట ముగ్గు గనులు, ఎర్రచందనం దోచుకుంటున్నారు. రాయచోటి ఎమ్మెల్యే భూములు దోచుకుంటున్నాడు. ఇలాంటి వాళ్లు మనకు అవసరమా? వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దులందరినీ చిత్తు చిత్తుగా ఓడించాలి.

టీడీపీ అధికారంలోకి వచ్చాక… పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తాం. హంద్రీ-నీవా కాలువ పనులు పూర్తి చేసి చెరువులకు నీళ్లిస్తాం. ఏపీఐఐసీ ద్వారా సేకరించిన 2500 ఎకరాల్లో పరిశ్రమలు తెస్తాం. మదనపల్లె, తిరుపతి రోడ్డును పూర్తి చేస్తాం. టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తాం” అని చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :