ఆంధ్రప్రదేశ్ : టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రా… కదలిరా సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రంలో హింసా రాజకీయాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలో ఉపాధి లేకపోవడంతో ప్రజలు పొరుగు ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిలో మార్పు తెస్తామని చెప్పారు.
తెలుగుజాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిస్తున్నా… రాతియుగం వైపు వెళ్లకుండా స్వర్ణయుగం వైపు వెళదాం అని అన్నారు. ఓడిపోతామని తెలియడంతో జగన్ మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీని ఇంటికి పంపడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాంక్ కావాలని పిలుపునిచ్చారు.
ఇక, వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని, వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నంత కాలం తమకేమీ అభ్యంతరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కానీ, వాలంటీర్లు వైసీపీకి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని హెచ్చరించారు. జగన్ ను నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీరు ఉద్యోగాలు తీసేస్తామని చెబుతున్నారని, తద్వారా వాలంటీర్లలో జగన్ అభద్రతా భావాన్ని కలిగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
తాము అధికారంలోకి వచ్చాక కోతలు లేని నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చార్జీలు పెంచకుండా అంతరాయాల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. జే బ్రాండ్ తో రాష్ట్రంలో నాసిరకం మద్యం విక్రయిస్తున్నారని, జగన్ కు ఇంకా ధనదాహం తీరలేదని విమర్శించారు.
తాము అధికారంలోకి వస్తే మద్యం ధరలు పెంచకుండా, నాణ్యమైన మద్యం తీసుకువస్తామని చెప్పారు. ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేయకపోతే ఓటు అడగను అన్నారు… అదే మద్యంపై రూ.25 వేల కోట్లు అప్పు తీసుకువచ్చారని చంద్రబాబు ఆరోపించారు.
జగన్ రాష్ట్రాన్ని దోచేసిన బకాసురుడు అని, ఒక్క చాన్స్ అని మీ నెత్తిన చేయి పెట్టిన భస్మాసురుడు అని అభివర్ణించారు. మనకు అన్యాయం చేసిన ఈ భస్మాసురుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు.