చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ సీఎం అవుతారని సీనియర్ సినీ నటుడు మురళీ మోహన్ అన్నారు. టీడీపీ అధినేత అరెస్టును నిరసిస్తూ తెలుగు సినీ ప్రముఖులు తాజాగా ‘చంద్రబాబు గారితో మనం’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో మురళీ మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు. సరైన ఆధారాలు చూపకుండా చంద్రబాబును అరెస్టు చేయడాన్ని వారు ఖండించారు. టీడీపీ అధినేతను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ చంద్రబాబును 74 ఏళ్ల వయసులో అరెస్టు చేసి జైల్లో పెట్టినందుకు ప్రతి ఒక్కరూ రగిలిపోతున్నారని చెప్పారు. తమ ఆవేదనను ఎలా బహిర్గతం చేయాలనే దానిపైనే అందరి ఆలోచన ఉందని పేర్కొన్నారు. వేట సమయంలో అడవిలోని పులులు, సింహాలు నాలుగు అడుగులు వెనక్కు వేసి ఉత్సాహంతో ముందుకు దూకినట్టుగా చంద్రబాబు కూడా రెట్టించిన ఉత్సాహంతో కార్యరంగంలోకి వస్తారని చెప్పారు. హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి చెందడానికి కారణమైన చంద్రబాబుకు ఈ పరిస్థితి రావడం శోచనీయమని విచారం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు ఇది గ్రహణం లాంటిదని మురళీ మోహన్ వ్యాఖ్యానించారు. గ్రహణం విడిచిన తరువాత ఆయన కూడా దేదీప్యమానమైన వెలుగులతో కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వ్యాఖ్యానించారు. అమరావతిని అద్భుతమైన నగరంగా నిర్మించడం కోసం రైతుల నుంచి 35 వేల ఎకరాలు సేకరించి అక్కడ అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు కట్టారని చెప్పారు. నాయకులు మారాక మూడు రాజధానుల స్కీమ్ తెచ్చారని అన్నారు. దేశానికి ఒక్క రాజధాని ఉంటే ఏపీకి మూడు రాజధానులు అవసరమా? అని ప్రశ్నించారు. నీతినిజాయతీలు ఉన్నవారికి భగవంతుడు అండగా ఉంటాడని, రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు.