టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖలో సద్భావన యాత్రలో పాల్గొన్నారు. ఆర్కే బీచ్ లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి విగ్రహం వరకు త్రివర్ణ పతాకం చేతబూని ఉత్సాహంగా నడిచారు. అనంతరం ఎంజీఎం మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మానస పుత్రిక విజన్ డాక్యుమెంట్-2047ను ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంట్ కు ‘ఇండియా, ఇండియన్స్, తెలుగూస్’ అని నామకరణం చేశారు. ప్రపంచ అగ్రగామి దేశంగా భారత్ అవతరించేందుకు 5 వ్యూహాలు పేరిట ఈ విజన్ డాక్యుమెంట్ ను రూపొందించారు. చంద్రబాబు అధ్వర్యంలోని జీఎఫ్ఎస్టీ బృందం విజన్ డాక్యుమెంట్-2047కి రూపకల్పన చేసింది.
ఈ విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, 2047లో వందేళ్ల స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉందని, మరో ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
2047 నాటికి అందరూ భారత్ రెండో స్థానానికి చేరుతుందని భావిస్తున్నారని, కానీ తాను మాత్రం అప్పటికి భారత్ నెంబర్ వన్ స్థానానికి ఎదుగుతుందని నమ్ముతున్నానని వెల్లడించారు. చైనాను మించి భారత్ అభివృద్ధి చెందాలి… ఇది భారతీయుల సంకల్పం… ఇదేమీ అసాధ్యం కాదు అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దశాబ్దం భారతదేశానిదేనని అందరూ అంటున్నారని, కానీ తాను మాత్రం ఈ శతాబ్దం భారతదేశానిదని చెబుతానని స్పష్టం చేశారు.
భవిష్యత్ పై స్పష్టమైన ప్రణాళిక లేకపోతే వ్యక్తి వికాసం కష్టమని అభిప్రాయపడ్డారు. పిల్లల చదువులపై తల్లిదండ్రులకు విజన్ ఉండాలని అన్నారు. విజన్ ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. ఏ విధంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఆలోచించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
“ప్రపంచంలో అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారు. మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని కోరుకోవాలి. దేశాభివృద్ధిలో తెలుగుజాతి ప్రముఖ పాత్ర పోషించాలి” అని ఆకాంక్షను వ్యక్తం చేశారు. మన ఆర్థిక విధానాల కారణంగా 1991 వరకు దేశాభివృద్ధి పెద్దగా జరగలేదని చంద్రబాబు తెలిపారు. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల శక్తిమంతంగా మారామని పేర్కొన్నారు. 90వ దశకంలో ఇంటర్నెట్ విప్లవం కారణంగా ప్రపంచ సరళిలో పెనుమార్పులు వచ్చాయని వివరించారు.
“మా దూరదృష్టి వల్లే నేడు హైదరాబాదు నగరంలో అత్యధిక తలసారి ఆదాయం లభిస్తోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2029కి పిలుపునిచ్చాను. విజయవాడ-గుంటూరు మధ్య అమరావతి నగరాన్ని తలపెట్టాం. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా మార్చాలని అనుకున్నాం” అని వెల్లడించారు.
ఈ సందర్భంగా సభా వేదికపై చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు, అమరావతి, కియా వంటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. “అమరావతి ఎంత బాగుందో చూడండి… కానీ దుర్మార్గుడు చేసిన పనికి బలైపోయింది. ఆఖరికి విశాఖపట్నం వాసులు కూడా అమరావతి కావాలని కోరుకుంటున్నారు. విశాఖ ప్రజలు మంచితనం, నిబద్ధత పట్ల మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
ఒకప్పుడు హైదరాబాద్ వెళితే చార్మినార్, అనంతపురం వెళితే క్లాక్ టవర్ చూపించేవాళ్లు. ఇప్పుడు హైదరాబాద్ వెళితే హైటెక్ సిటీ, అనంతపురం వెళితే కియా చూపిస్తున్నారు. కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనతో, సంపదను సృష్టించే దిశగా తీసుకున్న చర్యలు ఆ విధంగా ఫలించాయి. టీడీపీ హయాంలో ఐదేళ్లలో 10 శాతానికి పైగా అభివృద్ధి రేటు సాధించాం” అని పేర్కొన్నారు.