తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీ నందు గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. పాకాల పోలీసులు తెలిపిన వివరాల మేరకు దామలచెరువు అజాద్ నగర్ కు చెందిన అల్లావుద్దీన్ కుమారుడు ఆసీఫ్ (20) బైకుపై పాకాలకు బయల్దేరి వస్తుండగా మార్గమధ్యలో కుక్కలపల్లి సమీపంలోని రైల్వే గేట్ దగ్గర ఎదురుగా వస్తున్న పుంగనూరు ఆర్టీసీ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయనీ ఈ ఘటనలో ఆసీఫ్ తలకు తీవ్రమైన గాయాలయ్యి అతను అక్కడికక్కడే మృతిచెందాడన్నారు . మృతుడు సూళ్లూరుపేటలోని ఓ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాకాల సీఐ సుదర్శన్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
