తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, ఉప్పరపల్లి పంచాయతీ, ఊట్లవారిపల్లి ఆనందగిరి పై వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరిపించేందుకు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ఇప్పటికే మూడు సార్లు అధికారులతో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత సొంత మండలంలో మొదటిగా వచ్చిన బ్రహ్మోత్సవాలు కావడంతో మునిపటీ కన్నా మరింత సుందరంగా వైభవంగా జరిపించాలని ఇప్పటికే ఆలయ అధికారులతో, పలు శాఖల అధికారులతో, మండల నాయకులతో చంద్రగిరి ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. ఆలయ బ్రహ్మోత్సవాలు సమీపిస్తుండడంతో చంద్రగిరి ఎమ్మెల్యే ఐదు రోజులపాటు జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డిని ఆలయ అధికారులు, నూతన కమిటీ సభ్యులు, మండల పార్టీ నాయకులు “శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్, పాంప్లెట్స్” ఆవిష్కరణకు ఆహ్వానించారు. వీరి ఆహ్వానం మేరకు మంగళవారం ఆలయానికి చేరుకుని వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. పులివర్తి సుధా రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఘనంగా ఉత్సవాలు జరగాలని అంతేకాకుండా ఇది దైవకార్యం కావడంతో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. పులివర్తి నాని అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడంతో నాకు ఈ అవకాశం దక్కిందన్నారు. బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఆడి కృతిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మాట్లాడి భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఆలయం పరిసరాల చుట్టూ శానిటేషన్ చేయించాలని, ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని, పోలీసు యంత్రాంగం ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకుపోకుండా ముందస్తుగా తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే నాని మాట్లాడినట్లు ఆమె తెలిపారు. ఆలయ అధికారులు, మండల పార్టీ నాయకులు దైవ కార్యానికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఇతర శాఖలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు