- పంచాయతీ వారోత్సవాలు… సంక్షేమ బాటకు వాస్తవ రూపం…
- వాడవాడలా పల్లె పండుగలు పనులు ప్రారంభాలకు శ్రీకారం…
- పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని
తిరుపతి, చంద్రగిరి : వైసీపీ చీకటి పాలనతో చితికిపోయిన గ్రామాలలో పల్లె పండుగతో అభివృద్ధి మెండుగా నిర్వహించటానికి కృషి చేస్తున్నామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో” భాగంగా రామచంద్రపురం మండలం, మిట్టకండ్రిగ, కొత్త కండ్రిగ, కుప్పం బాదూరు, రాయల చెరువు పేట, సి కాలే పల్లి, నెత్త కుప్పం, కొత్తవేపకుప్పం, అనుప్పల్లి,బొప్పరాజు పల్లి గ్రామాలలో సిసి రోడ్లు, డ్రైనేజ్ కాలువలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నాని బుధవారం ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా రాయల చెరువుకు దిగువ భాగాన పూజలందుకుంటున్న భవాని జలకంఠేశ్వర ఆలయంలో మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూజలు చేశారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మిట్ట కండ్రిగ గ్రామానికి చేరుకున్నారు. యువత పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చుతూ జయ జయ నినాదాలతో తమ అభిమాన నాయకుడైన నానికి ఘన స్వాగతం పలికారు. మహిళలు కర్పూర నీరాజనాలతో దిష్టి తీసి గ్రామాలలోకి ఆహ్వానించారు. నాయకులు శాలువాలు కప్పి, గజమాలలు వేసి, పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతించారు. అంకాల పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు,చేసి వీర తిలకం దిద్దారు. దళిత వాడలలో తిష్ట వేసి ఉన్న సమస్యలను పల్లె ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తుల కోరిక మేరకు పలు సమస్యలను పరిశీలించారు. సీసీ డ్రైనేజ్ కాలువలకు భూమి పూజ చేశారు. ప్రతి గ్రామంలోనూ పేరుపేరునా నాయకుల పలకరించి యోగక్షేమాల విచారించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో ఆయన మాట్లాడుతూ పంచాయితీ వారోత్సవాలతో సంక్షేమ బాటకు వాస్తవ కార్యరూపం కల్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీలకు నిధులు అందించిన వాటిని గత వైసిపి ప్రభుత్వం పక్కదారి పట్టించిందని తెలిపారు. గత దుర్మార్గపు ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోకపోవడంతో పలు సమస్యలు ఏర్పడ్డాయని చెప్పారు. పెద్దాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో దూర దృష్టితో గ్రామాల అభివృద్ధిని పరుగులు పెట్టించటానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్ శాఖ ను అప్పగించారని తెలియజేశారు. గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా గుర్తించిన పవన్ కళ్యాణ్ పంచాయితీలకు జీవం పోస్తూ పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామాలలో వీధి లైట్లు,తాగునీరు,డ్రైనేజ్ కాలువలు,స్మశానం, కమ్యూనిటీ హాల్,బస్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఎన్నికలవేళ హామీలకు కార్యరూపం:
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యరూపం ఇచ్చి అమలు చేయటానికి వడివడిగా అడుగులు వేస్తున్నారని ఎంయల్ఏ నాని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రకటించినట్లుగా 4 వేల రూపాయల పింఛన్ పంపిణీ, మెగా డీఎస్సీ పై సంతకం, లాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, దీపావళి నుండి ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం వంటి సూపర్ సిక్స్ పథకాల అమలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. తాను మీ అందరి వాడని, మీరు చూపిన అభిమానంతో గెలిచానని మీ సమస్యల పరిష్కారానికి అన్నివేళలలో సిద్ధంగా ఉంటానన్నారు. మీకు ఏ సమస్య వచ్చిన స్థానిక నాయకుల ద్వారా నా దృష్టికి తీసుకు వస్తే అధికారులతో మాట్లాడి పరిస్కరిస్తాను అని తెలిపారు. ప్రభుత్వం మారినా గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకు సంబంధించిన గాయాలు ఇంకా మానలేదని నేడు ఎన్డీఏ కూటమి పాలన పారదర్శకంగా సాగుతున్నదని నెమ్మది నెమ్మదిగా రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నదని చెప్పారు. అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిద్దామని కోరారు. కోట్ల రూపాయల మౌలిక వసతుల పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి పార్టీల నాయకులు, మహిళలు, యువత, అధికారులు పాల్గొన్నారు.