తిరుపతి : తిరుమలలో చిరుత మళ్లీ కనిపించింది. భక్తులను భయపెడుతోంది. లక్షిత అనే చిన్నారిని చిరుత చంపిన ఘటనతో టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇవాళ నడకమార్గంలో మళ్లీ చిరుత కనిపించింది. మెట్ల దగ్గరకు చిరుత రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. నడకదారిలో చిరుత కనిపించింది. 2450 మెట్టు వద్ద చిరుత కనిపించడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భక్తులు భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భక్తుల భద్రత దృష్ట్యా 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు గుంపులుగానే భక్తులను అనుమతిస్తున్నారు.
100 మందికి కలిపి ఒక గుంపుగా పంపిస్తుండగా.. వారికి పైలట్‌గా ఒకరిని నియమిస్తున్నారు. అటు చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ అలర్ట్ అయింది.
రేపు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హైలెవల్ మీటింగ్ జరగనుంది.
కాలినడక మార్గాల,ఘాట్‌లలో యాత్రికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుందని తెలుస్తోంది. ఇప్పటికే రెండు ఘాట్ రోడ్లలో ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్రవాహనాలను అనుమతించనుంది.
ఆ తర్వాత బైక్‌లను కొండపైకి అనుమతించరు. ఇక 15 ఏళ్లలోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో అనుమతించరు.
చిరుత దాడిలో మృతి చెందిన లక్షిత అంత్యక్రియలు ఇవాళ నిర్వహించారు.
నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెంలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు జరిపారు. మృతదేహం వద్ద లక్షిత కుటుంబసభ్యులు రోదించగా.. గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. అయితే ఘటన జరిగిన ప్రాంతాన్ని ఇప్పటికే టీటీడీ ఛైర్మన్ భూమన పరిశీలించారు.
భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, లక్షిత సంఘటన బాధాకరమని ఆవేదన చెందారు. ఇలాంటి సంఘటనలను సాంకేతికంగా కూడా ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తామని టీటీడీ పేర్కొంది..