మహానగర చెన్నై కార్పొరేషన్ సరిహద్దులు మరింత విస్తరించనున్నాయి. శివారులోని 50 పంచాయతీలను కలుపుకుని 250 వార్డులుగా కార్పొరేషన్ మారనుంది.
ఇందుకు సంబంధించిన ప్రకటన ఈ ఏడాది చివర్లో వెలువడే అవకాశాలు ఉన్నాయి. గతంలో 174 చ.కి.మీ. విస్తీర్ణం,155 వార్డులు, 10 జోన్లతో ఉన్న చెన్నై కార్పొరేషన్ సరిహద్దులు 2011లో మరింత విస్తరించాయి. శివారులోని 9 మున్సిపాలిటీలు, 8 పట్టణ పంచాయతీలు, 25 పంచాయతీలను కలుపుకొని 424 చ.కి.మీ. విస్తీర్ణం, 200 వార్డులు, 15 జోన్లతో ప్రస్తుతం కొనసాగుతోంది. సరిహద్దులు మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఐఏఎస్ అధికారి సెంథిల్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ, శివారు ప్రాంతాల్లోని 50 పంచాయతీలను జీసీసీలో విలీనం చేయాలని ప్రతిపాదించింది.
ఆ జాబితాలో చెంగల్పట్టు జిల్లా పోరూర్, షోళింగనల్లూర్ శాసనసభ నియోజకవర్గాల్లోని కొన్ని పంచాయతీలు, తిరువళ్లూరు జిల్లా మదురవాయల్, పూందమల్లి, మాధవరం, పొన్నేరి నియోజకవర్గాల్లోని కొన్ని పంచాయతీలు, కాంచీపురం జిల్లా ఆలందూర్, శ్రీపెరుంబుదూర్ నియోజకవర్గాల్లోని కొన్ని పంచాయతీలు ఉన్నాయి.