మంచిర్యాల జిల్లా. చెన్నూరు..అధికార మాటున మున్సిపల్ నిబంధనలను తుంగలో తొక్కి, రోడ్డు స్థలాన్ని ఆక్రమించి వెంచర్ ఏర్పాటు చేసినట్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే చెన్నూరు శివారులోని సర్వే నెం 583, 584, ,585లో అధికార పార్టీకి చెందిన ఓ బడా నేత వెంచరు ఏర్పాటు చేస్తుండగా, జోగినీ కాలనీకి వెళ్లు రోడ్డును దాదాపు 30 ఫీట్ల మేర ఆక్రమించి ఫ్లాట్ల ఏర్పాటు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హయాంలో 50ఫీట్ల రోడ్డు నిర్మాణం చేసేందుకు పనులు సైతం మొదలు కాగా, ఇప్పటి ఎమ్మెల్యే అట్టి రోడ్డు పనులను నిలిపివేయగా అదనుగా భావించి అధికార పార్టీకి చెందిన ఓ బడా నేత రోడ్డు స్థలాన్ని ఆక్రమించి వెంచర్ ఏర్పాటు చేసాడని, వెంచర్ ఏర్పాటు చేసేందుకు గానూ అధికార పార్టీకి చెందిన మరో నేత ఎమ్మెల్యే పేరున 15శాతం వాటా డిమాండ్ చేస్తున్నాడని, రోడ్డు వెడల్పు 50ఫీట్లకు పెంచేందుకు సమీప ప్రజల నిర్మాణాలను సైతం బలవంతంగా తొలగించిన మున్సిపల్ అధికారులకు అధికార పార్టీ నేత ఆక్రమించిన రోడ్డు స్థలం కానరావడం లేదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ నిబంధనలకు విరుద్దంగా వెలుస్తున్న వెంచర్లపై అధికారులు చర్యలు తీసుకొని, రోడ్డు స్థలానికి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.