- కాన్పు కోసం వస్తే కానరాని లోకాలకు
- చెన్నూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి గర్భిణీ మృతి
- మృతదేహాన్ని తీసుకెళ్తుండగా పోలీసుల అత్యుత్ఛాహం
- కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
- న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
మంచిర్యాల జిల్లా, చెన్నూరు: పట్టణంలోని శ్రీ కిరణ్ ప్రయివేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన ఓ నిండు గర్భిణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, మహారాష్ట్ర లోని సిరోంచ మండలం కాన్సువెళ్లి గ్రామానికి చెందిన నిండు గర్భిణి రాపెల్లి మంగళ(30) అనే మహిళ కాన్పు కోసం ఆదివారం రోజున పట్టణంలోని శ్రీ కిరణ్ ప్రయివేటు ఆసుపత్రిలో చేరగా, సోమవారం రోజున వైద్యురాలు ఉదయం 5గంటలకు ఆపరేషన్ నిర్వహించగా మంగళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కొద్ది సేపటికే మంగళ ఆరోగ్యం క్షీనించడంతో ఆమెని మంచిర్యాలలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యలోనే మంగళ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొనగా, ఆమె మృతదేహాన్ని చెన్నూరుకు తీసుకువస్తున్న క్రమంలో పోలీసులు మృతదేహాన్ని అడ్డుకొని, కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేసి, మృతదేహాన్ని వారి అనుమతి లేకుండానే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భాదితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే ఆసుపత్రి యాజమాన్యానికి కొమ్ము కాస్తూ, వారికి వత్తాసు పలికి తమకు అన్యాయం చేస్తున్నారని, సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తీసుకొని, మంగళ మృతదేహాన్ని తమకు అప్పగించి, ఆసుపత్రి యాజమాన్యానికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకొని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.