- పత్తి కొని సీసీఐ డబ్బులు ఖాతాలో జమ చేయలేదంటూ రైతుల ఆవేదన
- రెండు నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం
- తమ పంట డబ్బులు ఇప్పించాలంటూ రైతుల వేడుకోలు
మంచిర్యాల జిల్లా,చెన్నూరు: సీసీఐలో పత్తి అమ్మి రెండు నెలలు గడుస్తున్నా తమ ఖాతాల్లో అధికారులు తమకు రావాల్సిన డబ్బులు జమ చేయలేదంటూ చెన్నూరు పట్టణంలోని చెన్నూరు ప్రెస్ క్లబ్ లో కోటపల్లి మండలం సిర్సా గ్రామ రైతులు తమ ఆవేదనను వెళ్ళబుచ్చారు. తమకు రావాల్సిన డబ్బుల గురించి రెండు నెలలుగా సబంధిత అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారు కళ్లిబొల్లి మాటలతో దాటవేస్తూ, తమను పట్టించుకోవడం లేదన్నారు. పంట డబ్బులు అందక తీవ్ర అవస్థలు పడుతున్నామని, పంట కోసం తెచ్చిన ఋణ భారం ఓ పక్కన పెరిగిపోతోందని, ఋణ దాతలు ఇంటి ముందుకు వస్తే వారికి సమాధానం చెప్పలేని దుస్థితి నెలకొందని వారు ఆవేదన చెందారు. ఇప్పటికైనా తమ ఆవేదనను గుర్తించి అధికారులు వెంటనే తమకు రావాల్సిన డబ్బులను తమ ఖాతాలో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.