రాజకీయనాయకులు, సినిమా వాళ్లకు ఉండే సెంటిమెంట్లు మరెవరికీ ఉండవు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు ఇలాంటి సెంటిమెంట్‌నే ఫాలో అయ్యారు. స్థానికంగా ఉన్న ఓ బాబాతో చెప్పులతో కొట్టించుకున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో రత్లాం నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పరాస్ సాక్లేచా ఈ ఉదయం రోడ్డు పక్కన ఉండే ఫకీర్ బాబా వద్దకు వెళ్లి కొత్త చెప్పులు ఇచ్చారు.
వాటిని తీసుకున్న బాబా.. పరాస్ నెత్తిపై చెడామడా వాయించాడు. ఆపై వాటితో చెంపలు చెళ్లుమనిపించాడు. ఆయన కొడుతున్నంతసేపు పరాస్ ఆనందంతో పరవశించిపోయారు. ఆయనతో చెప్పు దెబ్బలు తింటే ఎన్నికల్లో విజయం తథ్యమనే ఉద్దేశంతోనే ఆయనిలా చేశారు. చూడాలి మరి.. చెప్పు దెబ్బలకు ఓట్లు రాలుతాయో? లేదో? ఈ వీడియోను మీరూ చూడండి!