చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు-బెంగళూరు ప్రధాన రహదారిపై పలమనేరు నియోజకవర్గంలోని మొగిలి ఘాట్ వద్ద రెండు లారీలు, బస్సు ఢీకున్నాయి. భారీ స్థాయిలో ప్రమాదం జరగడంతో ఘటనా స్థలంలోనే 6గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.
గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సు పలమనేరు నుంచి తిరుపతి వెళ్తోంది. రెండు లారీలు, బస్సు ఢీకొని టెంపోపైకి వెళ్లాయి. దీంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నవారిలో ఇద్దరితో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన తమిళనాడులోని వేల్గూరు హస్పిటలక్ కు తరలించారు.
రోడ్డు ప్రమాదంపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచి వేసిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖకు సూచించారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అతి వేగం ఎప్పుడూ ప్రమాదకరమేనని పోలీసులు చెబుతున్నారు.
అతివేగంతో వెళ్లడం థ్రిల్ అనిపిస్తుంది. కానీ అది మన ప్రాణాల్ని తీస్తుందని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. దాదాపు అన్ని రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణంగా చెబుతున్నారు. రోడ్డుపై నిర్దేశించిన వేగంతోనే వెళ్లాలని పోలీసులు కోరారు.