పల్నాడు జిల్లా / చిలకలూరిపేట: నిత్యం వేలాది మంది ప్రయణించే చిలకలూరిపేట ఆర్టీసీ నిర్వహణ లోపం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. చిలకలూరిపేట జాతీయరహదారిపై ఉండటంతో నిత్యం వేలాది బస్సులు ప్రయణిస్తుంటాయి. తిరుపతి, చెన్నై, విజయవాడ, బెంగుళూరు తదితర ప్రాంతాలకు సెంటర్ పాయింట్‌గా ఉంటూ ప్రయాణికులకు ఎన్నో సేవలందిస్తోంది. అలాంటి ప్రాంగణాన్ని ప్రస్తుతం సౌకర్యాల లేమి వేధిస్తోంది. ఇక్కడ ఆర్టీసీ పరంగా పురోభివృద్ధి కరువైంది. చిలకలూరిపేట ప్రాంత ప్రజలకే కాకుండా ప్రధాన రూట్లతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో అసౌకర్యాల మధ్యనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.
వేధిస్తున్న వసతుల కొరత..
బస్తాండ్ ప్రాంగణం అంతా గోతుల మయంగా మారింది. చిన్న పాటి జల్లులు కురిసినా బస్టాండ్ ప్రాంగణం మంతా చిన్నచెరువులా మారుతుంది. ఇవే గోతులల్లో నీరు చేరి అన్ని కాలాల్లో నిల్వ ఉండి ప్రమాదకరంగా మారుతుంటాయి. బస్టాండ్ ప్రాంగణంలో బస్సులు రాకపోకలు కొనసాగించే రహదారులు ఆనవాళ్లు కోల్పొయాయి. ఎవరైనా ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండాలంటే కనీసం కూర్చేనే కుర్చీలు సరిపడ ఉండవు. ఫ్యాన్లు పనిచేయవు. ఏ బస్సు ఏ ఫ్లాట్ ఫారం మీద అగుతుందో నిర్లక్షరాస్యులకు తెలియజేసే ఎనోన్స్‌మెంట్ ఉండదు. ఇదిలా ఉంటే సిబ్బంది కొరత కూడా వేధిస్తున్నట్లు తెలుస్తుంది. అత్యధిక మంది గుంటూరు, విజయవాడకు ప్రయణిస్తుంటారు. బస్‌స్టేషన్‌లో ఎవరైనా ప్రయాణికుడు గొంతు తడుపుకుందామని ప్రయత్నిస్తే అధిక రేట్లకు దుకాణాల్లో దొరికే మంచినీళ్ల బాటిళ్లు కొనుగోలు చేయాల్సిందే. గతంలో అసిస్ట్ లాంటి స్వచ్చంధ సంస్థలు ప్రయాణికుల సౌకర్యార్దం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లు ఇక్కడ పనిచేయవు. వారంలోనే మరమత్తులకు గురయ్యేలా ప్రత్యేక వ్యక్తులు వీటిని నిలిపివేస్తుంటారు. ఉచిత నీరు అందితే తమ బాటిళ్లు కొనరని ఇలా చేస్తుంటారని చెబుతున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో స్వచ్చంధ సంస్థ ప్రయాణికుల కోసం లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన టాయిలెట్లుకు నీటి వసతి కల్పించకపోవడంతో ప్రారంభానికి ముందే అవి శిధిలావస్తకు చేరాయి.
నిలువు దోపిడి…
బస్టాండ్ ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రయాణికులు నిలువు దోపిడికి గురవౌతుంటారు. బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తినుబండారాలు, మంచినీళ్ల బాటిళ్లు, శీతల పానియాలు అధిక రేట్లకు అమ్ముతుంటారు. అధిక ధర చెల్లించి కొనుగోలు చేసినా అవి బ్రాండెడ్‌వి కాకపోవడం, నకిలీ పేర్లతో ఉండటంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ప్రయాణికులు వెళ్లిపోతుంటారు. అమ్మకాలు జరిపే ప్రతి వస్తువుపై ఎమ్మార్పీ, కాలపరిమితి తదితర అంశాలు తప్పనిసరిగా ఉండాలి. కాని ఇక్కడి దుకాణాల్ల్లో ఇవేమి కనబడవు. ఎవరైనా తనిఖీలకు వచ్చే సమయంలో మాత్రమే ఇవి బయట పెడుతుంటారు. ఇక నైనా అధికారులు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని, తనిఖీలు నిర్వహించాలని, కొత్త బస్సులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.