- చుండూరు మాలల ఊచకోత… ఆగస్టు 06, 1991 – తదనంతర పరిణామాలు –
ఘటనా క్రమం :అప్పటికే మాలల సామాజిక చైతన్యాన్ని చూసి ఓర్వలేక పోతున్న రెడ్లు, రవి అనే ఒక పోస్టు గ్రాడ్యుయేట్ కుర్రాడు చూపించిన తెగువను జీర్ణించుకోలేకపోయారు.. జులై 7 తారీఖున సినిమా హాలులో సినిమా చూసే క్రమంలో గమనించకుండా కుర్రి శ్రీనివాస్ రెడ్డి అనే కుర్రాడికి కాలు తగిలింది.. పొరపాటున జరిగిందని చెబుతున్నప్పటికీ వినకుండా… “మీ మాల నా కొడుకులకు కొంచెం చదువు అబ్బగానే కళ్ళు నెత్తికొస్తాయి” అంటూ దూషించడం మొదలెట్టడంతో, అతను ఎదురు తిరిగి గట్టి సమాధానమే చెప్పి వచ్చాడు.. తరువాత అతను ఒంగోలు వెళ్ళిపోయాడు..
ఈ ఘటనకు కోపోద్రిక్తులైన రెడ్లు, రవి ఆచూకీ చెప్పమని స్కూల్ టీచర్ అయిన ఆయన తండ్రి భాస్కర్ రావుని తీసుకెళ్ళి తీవ్రంగా కొట్టడం జరిగింది.. ఈ విషయం తెలుసుకుని ప్రమాదం గ్రహించిన రవి చుండూరు రాకుండా, పక్కనే ఉన్న పెదగాజులపల్లె లో తన బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు.. ఈ విషయం తెలుసుకున్న రెడ్లు అతని మీద దొంగతనం అభియోగం మోపి, అక్కడ దాక్కున్నాడనే నెపంతో అతనిని అక్కడే కొట్టి , మళ్ళీ చుండూరుకు తీసుకొచ్చి తీవ్రంగా అవమానించారు..
ఆప్పటికే సంఘటితంగా ఉన్న మాలలు, ఇంత జరుగుతున్న అందరికీ చెప్పి పోలీసు కంప్లైంట్ ఇవ్వకుండా లొంగిపోయినందుకు భాస్కర్ రావు కుటుంబానికి 25 రూ॥ జరిమానా విధించారు… అగ్రవర్ణాల దాడులను ప్రశ్నించడంతో అహం దెబ్బ తిన్న రెడ్లు, తెలగ కులస్తులు, కలిసి మాలలను సాంఘికంగా బహిష్కరించాలని తీర్మానం చేసి వారి భూములలో ఆ వూరి దళితులను పని చేయకుండా నిర్ణయించారు… దళితులను వారి నివాస ప్రాంతాల్లో రోడ్ల మీద నడవడాన్ని కూడా నిషేదించారు.. దీనితో నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని సరి చేయడానికి సెక్షన్ 144 విధించి.. సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయిబాబు ఆధ్వర్యంలో అగ్రకులాల రక్షణ కొరకు పోలీసు పికెట్ ఏర్పాటు చేసింది అప్పటి రెడ్ల ప్రభుత్వం.,
ఇలా మాలలు తిరగబడకుండా నిరోధించేందుకు పోలీసు పికెటింగు ఏర్పాటు చేయించుకుని, July 12 వ తేదీన., చుండూరు రెడ్లు, మొదుకూరు, దండిపాలెం, వలివేరు మొదలైన గ్రామాల రెడ్లను కలుపుకుని మాల పల్లి పై చేసిన దాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టడంతో రెడ్లు-తెలగలు చెల్లా చెదురుగా పారిపోయారు..
దీంతో కండ బలంతో మాలలను ఎదుర్కోలేమని గ్రహించి, పోలీసుల సాయంతో పథక రచన చేసారు…
ఆగస్టు 4 న రాజబాబు అనే కుర్రవాడు టీ కొట్టు దగ్గర పేపరు చదువుతుండగా, తమ అమ్మాయిలను ఏడిపించాడు అనే నెపం వేసి తీవ్రంగా కొట్టి, తిరిగి వాళ్ళే పోలీసు రక్షణ కోరి మాల పల్లిని పోలీసు నిర్బదంలో ఉండేలా చేసారు…
తరువాతి రోజు.. అంటే ఆగస్టు 5 న, ముందురోజు ఘటన పై వివరణ కోరుతూ, చిల్లర దుకాణం నడుపుతున్న యాకోబుకి MRO సమన్లు జారీ చేయడంతో, MRO ఆఫీసుకి వెళుతున్న యాకోబుని పట్టుకుని కత్తితో పొడిచి, తీవ్రగాయాల పాలు అయ్యేలా చేయడంతో అతనిని SI రక్షించి తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు…
ఆరోజు చాలా మంది యాకోబుని చూడడం కోసం తెనాలి వెళ్ళగా, అదే అదునుగా భావించి, వారు పోలీసు సాయంతో రూపొందించుకున్న కుట్రను అమలు చేసారు..
ఆగస్టు 6 :
మాలలతో ఎదురు పడి పోరాడే దైర్యం లేక, CI సాయిబాబు ఆధ్వర్యంలో పోలీసులతో “మిమ్మల్ని అరెస్టు చేయడానికి మంగళగిరి నుండి CRPF వాళ్ళను తెప్పిస్తున్నారు ఊరు వదిలి పారిపోయి ప్రాణాలు దక్కించుకోమంటూ” వాళ్ళను భయపెట్టసాగారు., అప్పటికీ వాళ్ళు ససేమిరా అనడంతో వాళ్ళని బలవంతంగా అక్కడి నుండి పొలాల్లోకి తరిమారు…
ముందుగా అనుకున్న పథకం ప్రకారమే, చుండూరు, మోదుకూరు, మెదలగు గ్రామాల రెడ్లు తెలగలు బృందాలుగా ఏర్పడి, ఇచనుపరాడ్లు, కత్తులు, గొడ్డళ్ళతో సిద్ధంగా ఉన్న చోటికే, పోలీసులు తమని తరుముతున్నారనే విషయం తెలియక, అటువైపు పరుగులు తీసి రెడ్ల మూకలకు చిక్కారు…
ఆ ఘటన ఎంత హేయమైన అమానవీయ కాండో, తృటిలో చావుని తప్పించుకున్న అప్పటికి 18 సం॥ల యువకుడైన దయారి ధనరాజ్ మాటల్లో తెలుస్తుంది…
దేవరపల్లి జయరాజు, kమాండ్రు రమేష్లతో పాటు పొలాల్లో పరిగెడుతున్న ధనరాజ్ ను మోదుకూరు రెడ్లు, ట్రాక్టర్లు, స్కూటర్లు వేసుకుని వెంబడించి పట్టుకోబోయారు., వారికి మాండ్రు రమేష్, జయరాజు దొరికిపోగా విచక్షణా రహితంగా గొడ్డళ్ళతో నరికారు, వారినుండి తప్పించుకున్న ధనరాజ్ ను ఇంకో రెడ్ల బృందం పట్టుకుని, ఇనుప రాడ్లతో కొడుతూ తీవ్రంగా హింసించసాగారు, ఇంతలో అందులో ఒకరు, తమ గ్రామంలో మల్లికార్జున రెడ్డి అనే వికలాంగుడికి కూడా కనీసం ఒక దళితుడినైనా చంపాలని ఆశ కాబట్టి వీడిని ఇక్కడే పారిపోకుండా ఉంచి ఆ వికలాంగుడిని తీసుకొచ్చి చంపిద్దాం అనుకుని… ఇనుప రాడ్డుతో కాలు విరగ్గొట్టి, పొలాలలో దొరికిన పశువుల ఇంజక్షన్ తో అతి క్రూరంగా రక్తాన్ని బయటకు లాగి ఇక పారిపోలేడని నిర్ణయించుకున్నాక అక్కడి నుండి మల్లికార్జున రెడ్డి కోసం వెళ్ళడంతో, ధనరాజ్ పక్కనే ఉన్న కాలువలో దూకి ఈత కొట్టుకుంటూ తన ప్రాణాలు కాపాడుకున్నాడు…
ఆ సమయానికి తను కొత్తగా కొన్న అర ఎకరం పొలంలో పని చేసుకుంటున్న రూబేను చెప్పిన దాని ప్రకారం ఆగస్టు 7 వ తేదీన మల్లె పొదలలో ఉన్న జాలాది ఇమ్మానుయేలు, జాలాది ముత్తయ్య, మల్లెల సుబ్బారావు మృతదేహాలు కనుగొనడం జరిగినది.. జాలాది ఇమ్మానుయేలు మృతదేహం మీద అసంఖ్యాక కత్తి పోట్లు ఉన్నాయి, మెడ మీద లోతుగా నరికినట్లు తెలుస్తుంది, ముత్తయ్య మృతదేహం అయితే మరీ ఘోరం, తను బ్రతికి ఉండగానే చేయి నరికి శరీరం నుండి వేరు చేసి పారేయడం బట్టి చూస్తే అక్కడ వర్ణించడానికి మాటలు చాలని ఎంత దారుణ హింసాకాండ జరిగినదో అర్థం అవుతుంది.
మిగతావారు తప్పించుకుని పారిపోయి ఉంటారు అనుకున్నప్పటికీ, ఆగస్టు 8 న అంగలకుదురు రాజమోహన్ శవాన్ని మూట కట్టి ఉన్న గోతాం, పక్కనే ఉన్న తుంగభధ్ర కాలువలో దొరకడంతో అనుమానం వచ్చి మిగతావారి ఆనవాలు కోసం వెతుకగా కొంచెం దూరంలో జాలాది ఐసాకు శవం గల గోతా మూట దొరికింది, అక్కడి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటూరి లాకుల వద్ద సుంకూరు సాంసోను మరియు దేవరపల్లి జయరాజుల మృత దేహాలు గలిగిన మూటలు, ఇంకొంచెం దూరంలో మోదుకూరు-ఆలపాడు రోడ్డు దగ్గర ఒక పంట కాలవలో మాండ్రు రమేష్ శవం కలిగిన గోనె సంచి దొరికింది…
మానవత్వానికే మచ్చగా చెప్పే విధంగా ఇంత దారుణంగా చంపి ముక్కలు చేసి గోనేసంచిలో కట్టి నీళ్ళలో విసరడం, రెడ్ల పైసాచికత్వానికి నిదర్శనం… ఆ శవాలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే., తన తమ్ముడు మాండ్రు రమేష్ మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో చూసి తట్టుకోలేక మాండ్రు పరిశుద్ధ రావు అక్కడికక్కడే గుండె పోటుతో చనిపోయాడు., ఈ శవాల పరిస్థితిని చూసి చలించిపోయిన డాక్టరు పోస్టు మార్టం చేసిన తరువాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు..
ఇంత ఘోరాతిఘోరం జరుగుతుంటే అక్కడే పికెట్ లో ఉన్న పోలీసు బృందం మాట్లాడకపోగా, రెడ్ల పిల్లలు స్కూల్ నుండి క్షేమంగా రావడానికి పోలీసు వాహనాలు పంపి తమ స్వామి భక్తి చాటుకున్నారు.. కావాలని మాలలను మృత్యు కుహారాల వైపు ఎగదోసిన పోలీసులు, ఆ పొలాల్లోకి పరిగెత్తిన వారి అరుపులు విని వారి స్త్రీలు కాపాడమని కాళ్ళు పట్టుకుని వేడుకుంటుంటే కరుణించకపోగా.. “అవి అరుపులు కాదు, వాళ్ళు పొలాల్లో పనిచేస్తూ ఆహ్లాదం కోసం పాటలు పాడుకుంటున్నారు” అని వెకిలిగా మాట్లాడుతూ వికృతానందం పొందారు.. అదే రాత్రి మాల పల్లి మీద దాడి చేసి ఇళ్ళను ద్వంసం చేసిన రెడ్డి తెలగ ముఠాలతో చేతులు కలిపి “మీ దగ్గర ఏముంది బూడిద అదే వారి పక్కన ఉంటే డబ్బుల కట్టలు వస్తాయి” అని సిగ్గు లేకుండా మాట్లాడి పోలీసు వ్యవస్థనే అసహ్యించుకునేలా చేసారు..
తరువాత కూడా అక్కడ అలాంటి ఘటనలు ఏమీ జరగలేదంటూ బుకాయించి కేసు కూడా నమోదు చేయలేదు.. ఆగస్టు7 న మూడు శవాలు దొరికిన తరువాత మాత్రమే పై స్థాయి పోలీసు యంత్రాంగం ముందుకు కదిలింది.. ఇంత భయంకరమైన హత్యాకాండ జరిగితే మీడియా కూడా దానిని గుర్తించడానికే ఇష్టపడక తనకు దళితుల మీద ఉన్న వివక్షను బయట పెట్టుకుంది..
తదనంతర పరిణామాలు :
కారంచేడు ఘటనలో ఈ దురాగతాలకు తాము పాల్పడలేదు అని బొంకిన అగ్రవర్ణాలు, ఈ సారి పూర్తిగా తమ పంథా మార్చుకున్నాయి… అగ్ర కులాలన్నీ ఏకమై పూర్తిగా సిగ్గు విడిచి ఈ దాడులు మేమే చేసాం మరియు “”ఇలాంటి చుండూరులు చాలా జరుగుతాయి”” అంటూ దళితులను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నాలు చేసింది..
అగ్రకులాలన్నింటినీ ఒక తాటిమీదకు తేవడానికి “సర్వ జనాభ్యుదయ పోరాట సమితి” పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసుకుని ఆగస్టు 17 న గుంటూరు బందుకు పిలుపునిచ్చారు.. ఈ అగ్రకుల రౌడీ మూకలంతా ఒక చోట చేరి, తమ బల ప్రదర్శనలో భాగంగా దళితులు అధికంగా చదువుకుంటున్న ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ మీద పెట్రోలు బాంబులతో దాడి చేసి దొరికిన దళిత విధ్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేసారు…
“ఇలాంటి చుండూరులు ఇంకా చాలా జరుగుతాయి… ఖబడ్ధర్”
“అడుక్కు తినే వాళ్ళకి ఆత్మాభిమానమెందుకు”
అంటూ అగ్రకుల దురహంకార పూరితమైన నినాదాలు చేస్తూ ప్రదర్శనలు చేస్తూ దళిత వాడలపై దాడులు చేసారు..
ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు పోలీసులు.. అగ్రకుల మీడియా కూడా వీరికి విస్తృతమైన ప్రచారం కల్పించి వీరిని దేశోధ్ధారకులుగా చిత్రీకరించింది..
దళిత మహాసభ పోరాటం:
ఈ ఘటనలు అన్నీ, దళితుల్లో భయాన్ని కల్పించకపోగా ఒక రాష్ట్ర వ్యాప్త ఐక్య ఉద్యమాన్ని నిర్మించుకుని, పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని గురించేలా ప్రేరేపించాయి… కత్తి పద్మారావు గారి ఆధ్వర్యంలో ఒక దళిత ఐక్య ఉద్యమం ఉవ్వెత్తున లేచి, దళిత ఐక్యపోరాటాలకు కార్యరూపం కల్పించింది..
ఈ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నాలలో భాగంగా పద్మారావుగారిని నిర్భంధించడం, దళితుల ప్రదర్శనల మీద పోలీసులతో దాడులు చేయించడం లాంటి పనులకు పూనుకుంది అప్పటి రెడ్డి సర్కారు.. అదే క్రమంలో సెప్టెంబరు 10 వ తేదీన శాంతియుతంగా ధర్నా చేస్తున్న సభ మీద పోలీసులతో దాడి చేయించి, ప్రధాన సాక్షి, మరియు యువ నాయకుడిగా ఉన్న కొర్రపాటి అనిల్ కుమార్ నే ధ్యేయంగా చేసుకుసి కాల్చి చంపి హత్య చేయించారు..
ఇలా ఎన్ని అవాంతరాలు కల్పిస్తున్నప్పటికీ ఉద్యమం రోజురోజుకూ, బలపడుతూ, తీవ్ర రూపం దాలుస్తూ జాతీయ స్థాయిని ఆకర్షిస్తుండడంతో అగ్రకులపార్టీలు నష్ట నివారణ చర్యలకు దిగి రాజీ ప్రయత్నాలు ప్రారంభించాయి.. “”న్యాయం కావాలి.. పరిహారం కాదు”” నినాదంతో ముందుకు వెళుతున్న ఉద్యమం, SC ST చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, కేసులో జాప్యం నిరోధించేందుకు SC ST చట్టం ప్రకారమే ప్రత్యేక కోర్టు చుండూరులో ఏర్పాటు చేయాలని చేసిన డిమాండుకు తల ఒగ్గి పార్టీలకు అతీతంగా 107 మంది MP లు స్వచ్చందంగా ముందుకు కదిలి ప్రధాని రాష్ట్రపతులతో సమావేశమై, 1993లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి సహకరించారు.. మొత్తం 219 మంది మీద 12 FIR లు నమోదు చేసారు…
అప్పటికీ అడుగడుగునా అవాంతరాలు ఏర్పరిచి కేసుని నీరుగార్చే ఉద్దేశంతో, విచారణలకు సహకరించకుండా కేసు తీర్పు జాప్యం చేయించేందుకు ప్రయత్నాలు చేసాయి అగ్రకుల ప్రభుత్వాలు., వీటితోపాటుగా దళితుల ఐక్యతను దెబ్బ తీసే చర్యలకు ఒడిగట్టి ఉద్యమాన్ని దెబ్బ కొట్టడంలో సఫలీకృతం అయ్యాయి..
ఐక్యత కొరవడిన కారణంగా ఉద్యమం బలహీనమై, 16 ఏళ్ళ తరువాత జులై 31,2007 న ప్రత్యేకకోర్టు 123 మంది మీద సాక్ష్యాలు లేవని విడుదల చేసి కేవలం 21 మందికి జీవిత ఖైదు, 35 మందికి ఒక సంవత్సరం శిక్షతో సరిపెట్టి కంటితుడుపు తీర్పు వెలువరించినపుడు బలంగా పోరాటం చేసే నాయకులే కరువైపోయారు…
మళ్ళీ హై కోర్టులో కేసు వెళ్ళినప్పటికీ న్యాయ వ్యవస్థలో గూడుకట్టి ఉన్న అగ్రకుల ఆధిపత్యం ముందు కేసు నిలవలేకపోయింది., దళితులు పోరాడి స్పెషల్ పబ్లిక్ల్ ప్రాసిక్యూటర్ గా నియమించుకున్న బొజ్జా తారకం గారితో ప్రభుత్వాలు గానీ, పోలీసులు గానీ సహకరించకపోవడంతో విచారణలో తీవ్ర జాప్యం జరిగేలా చేసి, దళిత ఉద్యమం నీరుకార్చిన తరువాత తీర్పు వెలువరించేలా రూపొందించిన కుట్రలో, అగ్రకుల ఆధిపత్య బ్రాహ్మణవాద న్యాయ వ్యవస్థ నిస్సిగ్గుగా పాలుపంచుకుంది..
ఆఖరికి ఘటన జరిగిన 23 సంపత్సరాలకు, 22 ఏప్రిల్ 2014, ఎల్. నరసింహ రెడ్డి, ఎం. ఎస్. కే. జైస్వాల్ లతో కూడిన హైకోర్టు ధర్మాసనం, మనుధర్మాన్ని మళ్ళీ వల్లిస్తూ అందరినీ నిర్దోషులుగా విడుదల చేసి తన అగ్రవర్ణ ఆలోచనా విధానాన్ని మరొక సారి చాటుకుంది..
“చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోకపోతే, చరిత్ర మీకు గుణపాఠం నేర్పుతుంది” అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటలను గుర్తు చేసుకుంటూ, జరిగిన చరిత్రనుండి పాఠాలు నేర్చుకుని, అందుకు తగిన వ్యూహాలను నిర్మించుకుంటూ భవిష్య పీడిత కులాల నాయకత్వం ముందుకు వెళ్తాల్సిన అవసరం ఉంది…
అలా ముందుకు వెళ్ళాడానికి స్పూర్తినిచ్చే క్రమంలో తమ ప్రాణాలు త్యాగం చేసిన చుండూరు అమర వీరులకు నివాళులు అర్పిస్తూ.
ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక…….