యువగళం పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ యువనేత నారా లోకేశ్ చేతిలో ఓ ఎర్రని పుస్తకం ఉండడం తెలిసిందే. తమను, తమ పార్టీ క్యాడర్ ను ఇబ్బందిపెట్టిన పోలీసులు, అధికారులు, నేతల పేర్లను ఆ రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల సంగతి తానే స్వయంగా చూసుకుంటానని లోకేశ్ పలు సందర్భాల్లో చెప్పారు.
తాజాగా, ఈ రెడ్ బుక్ అంశంలో నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ నోటీసులు పంపింది. రెడ్ బుక్ పేరుతో తమను బెదిరిస్తున్నారంటూ కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అధికారుల పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏసీబీ న్యాయస్థానం రాష్ట్ర సీఐడీకి సూచనలు చేసింది.
న్యాయస్థానం సూచన మేరకు సీఐడీ అధికారులు లోకేశ్ కు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్నట్టు వాట్సాప్ లో సీఐడీకి లోకేశ్ బదులిచ్చారు. కాగా, అధికారుల పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు జనవరి 9కి వాయిదా వేసింది.