హైదరాబాదులోని సీఐఎస్ఎఫ్ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్న తెలుగు ఆర్మీ జవాన్.. మృతి చెందాడు. విధుల్లో ఉండగా.. బెటాలియన్‌కు చెందిన బస్సులో వెళ్తున్న క్రమంలో తన వద్ద ఉండే తుపాకీ ప్రమాదవశాత్తు పేలటంతో.. తూటా తలలోకి దూసుకెళ్లి.. అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన బీడీఎస్ భానూరులో జరిగింది. ఏపీలోని నంద్యాల జిల్లా అవుకు మండలం జూనుతుల గ్రామానికి చెందిన వెంకటేష్.. హైదరాబాద్ సీఐఎస్‌ఎఫ్ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.
భానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తించి.. బెటాలియన్ బస్సులోనే తిరిగి వెళ్తున్న సమయంలో వెంకటేష్ దగ్గరున్న తుపాకీ ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో తుటా.. తన గడవ కింది నుంచి తలను తీల్చుకుంటూ వెళ్లి బస్సు టాప్‌ను తగిలింది. మెదడు చిట్లి పోయి.. తీవ్ర రక్తస్రావం జరగటంతో వెంకటేష్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. అయితే.. గన్ మిస్ ఫైర్ అయ్యిందా.. లేదా ఇంకేదైనా జరిగిందా అని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
13 సంవత్సరాల క్రితం ఉద్యోగంలో చేరిన వెంకటేష్.. గతంలో రెండేళ్ల పాటు ఢిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద విధులు నిర్వర్తించాడు. మృతునికి ఒక కూతురు, కుమార్తె ఉన్నారు. తండ్రి పెట్నికోట వడ్డే వెంకటస్వామి, తల్లి కూలీ పనులు చేస్తూ.. ప్రస్తుతం జూనూతల గ్రామంలోని నివసిస్తున్నారు. ఉద్యోగంలో ఉన్న కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.