ఏపీలో రేషన్ అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు . సివిల్ సప్లయిస్ వాహనాలకు జియో ట్యాగింగ్ చేసి మానిటర్ చేస్తామని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరసరఫరాల పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ప్రతిపక్షాలు పౌర సరఫరా వ్యవస్థ పై విమర్శలు చెయ్యటానికి తావు లేకుండా, అలాగే ఏపీలో పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేసేలా చర్యలు చేపట్టింది . అందులో భాగంగా రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ ను నేడు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు.ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విజయవాడలో బుధవారం సివిల్ సప్లై కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పౌర సరఫరా ఏ విధంగా జరుగుతుందో పర్యవేక్షించడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం దారి మళ్ళిన క్షణాల్లో సమాచారం అందుతుందని, అన్ని సివిల్ సప్లై వాహనాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశామని, తద్వారా వాహనాన్ని ట్రాక్ చేస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు.రేషన్ సరుకులు రవాణా పంపిణీలో అక్రమాలకు పటిష్టమైన ఆన్లైన్ నిఘా వ్యవస్థ ద్వారా చెక్ పెట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పైన విరుచుకుపడిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సివిల్ సప్లై శాఖలో అప్పులు పెరగడానికి చంద్రబాబునే కారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి నారా లోకేష్ అంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన లోకేష్ పాదయాత్ర పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.