ప్రకాశం జిల్లా : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ(UPSC) నిర్వహించిన సివిల్స్(civils)-2023 తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం ఈ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఓ దళిత యువకుడు సివిల్స్ ఎంపిక కావడం అందరికీ స్ఫూర్తిగా నిలుచాడు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి కి చెందిన వంగీపురం రాహుల్ కుమార్ 504 ర్యాంక్ సాధించి సివిల్స్‌కు ఎంపికయయారు.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగా ఎంతోమంది యువత సివిల్ సర్వీసెస్ కోసం సన్నద్ధమవుతుంటారు. సివిల్స్ సాధిస్తే కీర్తి తో పాటు దేశానికి సేవ చేయొచ్చని భావిస్తుంటారు. చాలా మంది మొదటి ప్రయత్నంలో విఫలమైనా కూడా పట్టు వదలకుండా సివిల్స్ సాధించే వరకు ఏళ్ల కేళ్లు ప్రిపేర్ అవుతుంటారు. మన దేశంలో సివిల్స్ కు ప్రాధాన్యత ఆ రేంజ్ లో ఉంటుంది. ప్రతీ ఏడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంటుంది. సివిల్స్ సాధించాలని యువత బలమైన సంకల్పంతో ప్రిపరేషన్ సాగిస్తుంటారు. ఇలాగే ఏపీకి చెందిన ఓ యువకుడు అంకితభావంతో చదివి సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటారు. తల్లిదండ్రుల కష్టం చూసి ఎలాగైన మంచి ఉద్యోగం పొందాలని రాహుల్ కుమార్ భావించారు. రెండవ సారి సివిల్స్ ప్రయత్నంలో 504 ర్యాంక్ సాధించారు. ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యే అవకాశముంది.
ప్రకాశం జిల్లా కనిగిరి చెందిన వంగిపురం రత్నకుమార్ , వయోలా రాణి దంపతుల కుమారుడు వంగిపురం రాహుల్ కుమార్ సివిల్స్ లో ర్యాంక్ సాధించి పుట్టిన ఊరికి, తల్లిదండ్రులకు గర్వకారణమయ్యాడు. రాహుల్ తండ్రి రత్నకుమార్ వెటర్నరీ డిపార్ట్మెంట్ లో సేవలందిస్తున్నారు, తల్లి స్కూల్ అసిస్టెంట్ గా చింతలపాలెం లో విధులు నిర్వహిస్తున్నారు.