contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మహిళా న్యాయమూర్తికి జిల్లా జడ్జి లైంగిక వేధింపులు .. సుప్రీంకోర్టు సీజేఐకి లేఖ .. !

సీనియర్ల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళా న్యాయమూర్తి ఒకరు తన బాధలు చెప్పుకుంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాయడం సంచలనమైంది. ఇప్పుడీ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన సుప్రీం సీజేఐ ఈ ఘటనపై తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆమె సీజేఐకి బహిరంగ లేఖ రాస్తూ.. సామాన్య ప్రజలకు న్యాయం చేసేందుకు న్యాయవాద వృత్తిలో చేరిన తానే ఇప్పుడు న్యాయం కోసం ప్రతి తలుపు తట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు కొన్ని నెలలుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. తనను పురుగు కంటే హీనంగా చూస్తున్నారని, రాత్రివేళ తనను ఒంటరిగా వచ్చి కలవమంటున్నారని ఆమె ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

తనపై జరుగుతున్న వేధింపులపై ఈ ఏడాది జులైలో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈ కేసులో సాక్షులైన వారు కూడా తనను వేధింపులకు గురిచేస్తున్న జిల్లా న్యాయమూర్తి అనుచరులేనని, వారు తమ బాస్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారని తానెలా అనుకుంటానని పేర్కొన్నారు. కాబట్టి దర్యాప్తు పూర్తయ్యేంత వరకు ఆయనను మరో చోటికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన అభ్యర్థనను కొట్టివేశారని వాపోయారు. ఏడాదిన్నరగా జీవచ్ఛవంలా బతుకుతున్న తాను బతికి ఉండి ఎలాంటి ప్రయోజనం లేదని, తాను గౌరవప్రదంగా చనిపోయేందుకు అనుమతినివ్వాలని ఆ లేఖలో వేడుకున్నారు.

ఈ లేఖ తన దృష్టికి రావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వెంటనే స్పందించారు. దీనిపై తక్షణం నివేదిక కావాలని, విచారణకు సంబంధించిన మొత్తం వివరాలు సమర్పించాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :