రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో సీఎం కేసీఆర్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రశాంత వాతావరణంలో పురోభివృద్ధి దిశగా పయనిస్తుంటే, మతపిచ్చిగాళ్లు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇలాంటి స్వార్థపరులైన మతపిచ్చిగాళ్లను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి దెబ్బతింటే వందేళ్లు నష్టపోతామని అన్నారు. బంగారు పంటలు పండే తెలంగాణ రాష్ట్రం కావాలో, మతపిచ్చితో భగ్గుమనే తెలంగాణ రాష్ట్రం కావాలో ప్రజలే తేల్చుకోవాలని పేర్కొన్నారు.
“ఇవాళ బీహార్, బెంగాల్ లో ఏం జరుగుతోంది? ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మోదీకి ఏం తక్కువైంది… ఇప్పుడున్న ప్రధాని పదవి కూడా చాలడంలేదా?” అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
తాను బతికుండగా తెలంగాణ రాష్ట్రం ఛిన్నాభిన్నం కానివ్వనని, శక్తిమ్తొతం ధారపోసి రాష్ట్రాన్ని ఏకతాటిపై నిలుపుతానని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. తన బలం, బలగం తెలంగాణ ప్రజలేనని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యవంతులను చేసే బాధ్యత మేధావులు, విద్యాధికులపైనే ఉందని అన్నారు.